ఆ ఒక్క రోజు.. ఒక్క బకెట్​ నీళ్లే!

ఆ ఒక్క రోజు.. ఒక్క బకెట్​ నీళ్లే!

ఈ ఎండాకాలం నీళ్ల కోసం జనం పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ అదే పరిస్థితి. జులై సగం అయిపోయినా వర్షాల జాడ కనిపించట్లేదు. ఇంకొన్నాళ్లూ ఆ నీటి ఎద్దడి పరిస్థితులు వదిలేలా లేవు. అందుకే ఇప్పుడు ఓ కొత్త చాలెంజ్​ ముందుకొచ్చింది. అదే ‘ఒక బకెట్​ నీళ్ల చాలెంజ్​’. అవును, ఇప్పుడు నెట్టింట్లో దానిపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఆదివారం అంటే జులై 21న అందరూ నల్లాలు, షవర్లు బంద్​పెట్టి ఒక్క బకెట్​ నీళ్లతో రోజంతా గడిపేయాలి. పళ్లు తోముకోవడం దగ్గర్నుంచి, స్నానం దాకా దాంతోనే సరిపెట్టుకోవాలి. ఈ చాలెంజ్​ను హీరోయిన్​ సమంత తన ట్విట్టర్​లో ప్రారంభించారు. ‘‘ఆదివారం.. ఒక బకెట్​ చాలెంజ్​. ఎక్కువసేపు స్నానాల్లేవ్​. బండ్లు కడగడాల్లేవ్​. నల్లాను వదిలిపెట్టకూడదు. నేను ఈ సవాల్​కు సిద్ధం. బ్లూ బకెట్​తో ఫొటో కూడా షేర్​ చేస్తా. మీరూ సిద్ధమా? ఫొటోలూ పోస్ట్​ చేయాలి. చీటింగ్​ చేయొద్దు” అంటూ ట్విట్టర్​లో చాలెంజ్​ ఫొటోతో పోస్ట్​ చేశారు. ఇక, ‘హైదరాబాద్​ ఎండిపోతోంది’ టైటిల్​తో సమంత పోస్ట్​ చేసిన ఆ ఫొటో సారాంశం ఇదీ…

చాలా మంది నీళ్లు నల్లా నుంచి వస్తాయనుకుంటారు. కానే కాదు. వేలాది సంవత్సరాల పాటు నిమ్మలంగా వర్షం నీరు భూమిలోకి ఇంకడం వల్ల మనకు నీళ్లు వస్తున్నాయి. కానీ, మనం మాత్రం కేవలం క్షణాల్లో 1500 అడుగుల లోతులో ఉన్న నీటిని తోడేసి వాడేస్తున్నాం. ప్రభుత్వం అర్జెంట్​గా సమగ్ర నీటి చట్టాలను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కఠినమైన బోర్​వెల్​ చట్టాన్ని చేయాలి. అందుకు మనమూ తోడ్పాటునివ్వాలి. అదే మనకు భవిష్యత్తునిస్తుంది. అందులో భాగంగా జులై 21న అందరం ఒక్క బకెట్​ నీళ్లనే వాడే సవాల్​ను తీసుకుందాం. నల్లాలు బంద్​ పెడదాం. బ్రష్​, స్నానం, చేతులుకడుక్కోవడం, ప్రతి పనికీ రోజంతా ఆ ఒక్క బకెట్​ నీటితోనే సరిపెట్టుకుందాం. మొన్నటిదాకా దేశం మొత్తం ఇదే బాధను అనుభవించింది. ఒక్కో నీటి చుక్క కోసం కష్టపడింది. కాబట్టి ఆ ఒక్క రోజు మనమూ ఈ వన్​ బకెట్​ చాలెంజ్​ను స్వీకరిద్దాం. భవిష్యత్​ గురించి ఇప్పుడే మేల్కోవాల్సిన అవసరం ఉంది. తలచుకుంటే చాలా నీటిని మనం ఆదా చేయగలం. సముద్రంలో ఒక్క నీటి బొట్టు లెక్క కాకపోవచ్చు. కానీ, మనకు ఆ ప్రతి ఒక్క చుక్క విలువైనదే.