మా ‘డ్రైస్వాబ్’ కిట్లనూ వాడండి.. ప్రభుత్వానికి సీసీఎంబీ లేఖ

మా ‘డ్రైస్వాబ్’ కిట్లనూ వాడండి.. ప్రభుత్వానికి సీసీఎంబీ లేఖ

హైదరాబాద్, వెలుగు: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తాము తయారు చేసిన ‘డ్రై స్వాబ్’ కిట్లతోనూ టెస్టులు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సీసీఎంబీ కోరింది. డ్రై స్వాబ్ కిట్ల వాడకంపై రాష్ట్ర సర్కారుకు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా లేఖ రాశారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న వేగానికి ఇప్పుడు చేస్తున్న టెస్టులు సరిపోవని, మరింత ఎక్కువ టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. తాము తయారు చేసి టెస్ట్ కిట్లతో కొన్ని నిమిషాల్లోనే రిజల్ట్ వస్తుందని చెప్పారు. టెస్టులకు కావాల్సినన్ని కిట్లను అందించేందుకు తాము సిద్ధమన్నారు. అవసరమైతే తామూ టెస్టులు చేస్తామన్నారు. దీనిపై సర్కారు నుంచి స్పందన రాలేదని రాకేశ్ మిశ్రా వెల్లడించారు. 
టెస్ట్ చేయడం ఈజీ
మామూలుగా ఆర్టీపీసీఆర్ టెస్టు చేస్తే రిజల్ట్ కోసం రెండ్రోజులు వెయిట్ చేయాలి. దాన్ని తప్పించేందుకు యాంటీజెన్ టెస్టులు చేస్తున్నా.. ఒక్కోసారి రిజల్ట్ తప్పుగా చూపిస్తోంది. దీంతో మళ్లీ ఆర్టీపీసీఆర్ను  చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే డ్రై స్వాబ్ డైరెక్ట్ ఆర్టీపీసీఆర్ అనే కొత్తరకం టెస్టును అపోలో ఆస్పత్రితో కలిసి సీసీఎంబీ గతేడాది అభివృద్ధి చేసింది. దీనికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్  ఆమోదం  తెలిపింది. ఈ పద్ధతిలో టెస్టు చేయడం ఈజీ కావడంతో పాటు కొద్ది గంటల్లోనే రిజల్ట్ వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో వేగంగా టెస్టు చేయొచ్చంటున్నారు. రిజల్ట్ కూడా మామూలు ఆర్టీపీసీఆర్ టెస్టుల తరహాలోనే కచ్చితత్వంతో వస్తుందని హామీ ఇస్తున్నారు. యాంటీ జెన్ టెస్టుల్లాగానే స్వాబ్తో ముక్కు నుంచి శాంపిల్ తీసి టెస్ట్ చేయొచ్చని, రూం టెంపరేచర్ వద్దే స్టోర్ చేసుకోవచ్చని అంటున్నారు.