సాగర్​లో నిల్వ నీళ్లను వాడుకుంటం: కేఆర్ఎంబీని కోరిన తెలంగాణ

సాగర్​లో నిల్వ నీళ్లను వాడుకుంటం: కేఆర్ఎంబీని కోరిన తెలంగాణ

హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్​లో తాము నిల్వ ఉంచుకున్న 18.70 టీఎంసీల నీళ్లను వాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేఆర్ఎంబీని తెలంగాణ కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్​శివ్​నందన్​కుమార్​కు ఇరిగేషన్​ఈఎన్సీ (జనరల్) మురళీధర్​శుక్రవారం లేఖ రాశారు. తమ రాష్ట్రంలో కృష్ణా నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో 2022–23 వాటర్​ఇయర్​లో నాగార్జున సాగర్​లో తమ వాటా18.70 టీఎంసీలను నిల్వ చేసుకున్నామని అందులో పేర్కొన్నారు.
 ఏపీ తమ కోటాకు మించి నిరుడు 51.74 టీఎంసీలు అధికంగా వాడుకున్నదని, ఇప్పుడు సాగర్​లో నిల్వ ఉన్న నీళ్లు తెలంగాణకు చెందినవేనని తెలిపారు. వర్షాకాలం ఆరంభంలో తాగు, సాగు నీటి అవసరాల కోసమే తాము ఏటా నీటిని నిల్వ ఉంచుతున్నామని గతంలోనూ బోర్డు దృష్టికి తీసుకువచ్చామన్నారు. నాగార్జునసాగర్​లోకి ఈ వాటర్​ఇయర్​లో కొత్తగా ఇన్​ఫ్లోస్​ రాలేదని, ఈ పరిస్థితుల్లో తాము నిరుడు ఉపయోగించుకోకుండా నిల్వ చేసుకున్న నీటిని వాడుకునే హక్కు ఉంటుందని చెప్పారు. 
సాగర్​ కుడి కాలువ నుంచి తాగునీటి కోసం 5 టీఎంసీలు ఇవ్వాలంటూ ఏపీ ఇండెంట్​సమర్పించిందని, కానీ బ్రజేశ్​కుమార్ ​ట్రిబ్యునల్​(కేడబ్ల్యూడీటీ –2)కి 2009లో సమర్పించిన రిపోర్టు ప్రకారం కుడి కాలువ కింద తాగునీటి అవసరాలు 2.84 టీఎంసీలేనని పేర్కొన్నారు. దానికి విరుద్ధంగా తాగునీటికి 5 టీఎంసీలు కావాలని కోరుతోందన్నారు. తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి సాగర్​లో నిల్వ ఉంచుకున్న నీటిని వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.