ఉస్మాన్సాగర్ నుంచి   కొత్త పైప్లైన్..  ఆసిఫ్నగర్ ఫిల్టర్ బెడ్స్ వరకూ నిర్మాణం

ఉస్మాన్సాగర్ నుంచి   కొత్త పైప్లైన్..  ఆసిఫ్నగర్ ఫిల్టర్ బెడ్స్ వరకూ నిర్మాణం

 

  • ప్రస్తుతం కాండ్యూట్​ ద్వారా గ్రావిటీతో నీటి తరలింపు
     దీనికి సమాంతరంగా కొత్త లైన్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: నిజాం కాలంలో నిర్మించిన ఉస్మాన్​సాగర్​నుంచి మరింత ఎక్కువ నీటిని డ్రా చేయడానికి వాటర్​బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

1920లో నిర్మించిన ఈ రిజర్వాయర్​నుంచి 27 ఎంజీడీలను ఆసిఫ్​నగర్​ఫిల్డర్​బెడ్స్​వరకు తరలించడానికి అవకాశం ఉన్నా, కాండ్యూట్ (రాతి కాలువ) ​శిథిలావస్థకు చేరడం, లీకేజీలు పెరగడంతో 21 ఎంజీడీలే సరఫరా అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న సోర్స్​నుంచే కొంత ఎక్కువ నీటిని డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఉస్మాన్​సాగర్​ కాండ్యూట్​కు సమాంతరంగా మరో 900 ఎంఎం పైప్​లైన్​ నిర్మించాలని  ప్రతిపాదించారు. 

రూ. 282 కోట్లతో పైప్​లైన్​ నిర్మాణం

నిజాం కాలంలో 14.6 కి.మీ. పొడవున నిర్మించిన కాండ్యూట్​ ద్వారా నీటిని ముందు ఆసిఫ్​నగర్​ఫిల్టర్​ బెడ్స్​కు తీసుకువచ్చి శుద్ధి చేసి తర్వాత నగరానికి అందిస్తారు. ఈ క్రమంలో లీకేజీలను తగ్గించడానికి, వృథాను అరికట్టడానికి కాండ్యూట్​కు సమాంతరంగా పైప్​లైన్​ వేయాలని ప్రతిపాదనలు పంపడంతో సర్కారు ఓకే చెప్పింది. ఎన్​సీపీఈ ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ఇండియా అనే సంస్థ డీపీఆర్​ను కూడా బోర్డుకు అందజేసింది. 

మొత్తం ఆరు ప్రతిపాదనలు 

డీపీఆర్​లో వివరించిన దాని ప్రకారం కన్సల్టెన్సీ ఆరు ప్రతిపాదనలు చేసింది. ఇందులో ఉస్మాన్​సాగర్​నుంచి ఆసిఫ్​నగర్​వరకు నిర్మించే పైప్​లైన్​తో పాటు మధ్యలో 0.5 మిలియన్​ గ్యాలన్ల సంప్​కమ్​పంప్​హౌస్​ను నిర్మించాలని ప్రతిపాదించింది. అలాగే 1500 ఎంఎం గ్రావిటీ మెయిన్​ పైప్​లైన్​ నిర్మాణం(800 మీటర్లు), 1300 ఎంఎం పంపింగ్​మెయిన్​(9.9 కి.మీ.)21 ఎంజీడీల వాటర్​ ట్రీట్​మెంట్​ప్లాంట్​, 1100 ఎంఎం పైప్​లైన్​(300 మీటర్లు), 1000 ఎంఎం గ్రావిటీ మెయిన్​(5 కి.మీ.) నిర్మించాలని ప్రపోజల్స్​సిద్ధం చేసింది.

ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ. 282 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఉస్మాన్​సాగర్​పొడవునా సమాంతరంగా పైప్​లైన్​ వేస్తే ఈ రిజర్వాయర్​నుంచి నిరంతర నీటి సరఫరా సాధ్యమవుతుందని తెలిపింది.