కాంగ్రెస్​లో ఆగని​ కయ్యం..రేవంత్​పై సోనియా, రాహుల్​కు ఉత్తమ్​ ఫిర్యాదు

కాంగ్రెస్​లో ఆగని​ కయ్యం..రేవంత్​పై సోనియా, రాహుల్​కు ఉత్తమ్​ ఫిర్యాదు
  • ఢిల్లీ మీటింగ్​లోనూ కుదరని సయోధ్య 
  • తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి కామెంట్​
  • సీనియర్లపై రాహుల్​ గాంధీ సీరియస్​  
  • క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని వార్నింగ్

హైదరాబాద్​, వెలుగు:  కాంగ్రెస్​ పార్టీలో నేతల మధ్య కయ్యాలు ఆగడం లేదు. ‘అంతా బాగానే ఉన్నాం.. కలిసికట్టుగా ముందుకుపోతాం’ అని బయటకు చెప్తున్నా.. లోపల పాత గొడవలు రగులుతూనే ఉన్నట్టు కనిపిస్తున్నది. పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి మీద ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఢిల్లీలో బహిరంగంగా ఆరోపణలు చేయడం, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీలో ఐక్యత గురించి మాట్లాడడం, పార్టీలో కోవర్టులున్నారంటూ సీతక్క కామెంట్​ చేయడం, పార్టీ అన్నాక భేదాభిప్రాయాలు సహజమని పార్టీ సీనియర్​ నేత రేణుకా చౌదరి అనడం ఆ పార్టీలోని నేతల మధ్య ఇంకా సఖ్యత కుదరలేదని తేల్చి చెప్తున్నాయి. ఇది కాస్తా హైకమాండ్​ వద్దకు చేరింది. ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశంలో.. రేవంత్​పై రాహుల్​కు ఉత్తమ్​ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే, రాహుల్​ కూడా పార్టీలో గొడవలపై సీరియస్​ అయ్యి, సీనియర్​ లీడర్లను మందలించినట్టు తెలిసింది. 

రేవంత్​తో ఉత్తమ్​కు ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. హుజూర్​నగర్​ బైపోల్ ​టైమ్​లో​ఉత్తమ్​ తన భార్య పద్మావతికి టికెట్ ​ప్రకటించడం.. ఆ తర్వాత రేవంత్​ మరో అభ్యర్థిని అనౌన్స్​చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు ముదిరాయి. దీనిపై అప్పట్లో పీఏసీ మీటింగ్​లో రేవంత్​పై ఉత్తమ్​ అప్పటి పార్టీ రాష్ట్ర ఇన్​చార్జికి ఫిర్యాదు కూడా చేశారు. తనపై సోషల్​ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని గత నెల ఐదో తేదీన పోలీసులకూ కంప్లైంట్​చేశారు. దీంతో సీసీఎస్​ పోలీసులు యూత్​ కాంగ్రెస్​ సోషల్​ మీడియా వార్​ రూమ్​పై దాడి చేశారు. ఉత్తమ్​పై దుష్ప్రచారం అక్కడి నుంచే జరుగుతున్నట్టు గుర్తించామని, ఉత్తమ్​ ఫిర్యాదు ఆధారంగానే సోదాలు చేసినట్టు చెప్పారు. 

ఇది ప్రియాంకా గాంధీ సభకు రెండు మూడు రోజుల ముందే జరగడం గమనార్హం. దీంతో వివాదం మరింత తీవ్రమైంది. అయితే, నల్గొండలో నిరుద్యోగ నిరసన సభలో రేవంత్​తో కలిసి సభలో పాల్గొన్న ఉత్తమ్​.. తమలో విభేదాలేవీ లేవన్నారు. సరిగ్గా నెల తిరిగిందో లేదో..  ఆ మాటలు కూడా రివర్స్​ అయిపోయాయి. తన మీదకు పార్టీలోని నేతతోనే ఎదురు దాడి చేయిస్తున్నారని, ఆ వ్యక్తికి ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చారని రేవంత్​పై డైరెక్ట్​గా బాంబు పేల్చారాయన. రెండు రోజుల క్రితం సోనియా గాంధీకి, తాజాగా రాహుల్​ గాంధీకి కూడా దీనిపై ఉత్తమ్​ ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. తనపై రేవంత్​ టీం దుష్ప్రచారం చేస్తున్నదని ఉత్తమ్​ ఆధారాలను కూడా సమర్పించారని తెలుస్తున్నది. 

పార్టీ మారుతారంటూ ప్రచారం

కాంగ్రెస్​ పార్టీలోని కొందరు సీనియర్​ నేతలు అధికార పార్టీ బీఆర్​ఎస్​లోకి జంప్​అయ్యేందుకు సిద్ధమవుతున్నారని కొన్ని రోజులుగా కథనాలు ప్రసారమయ్యాయి. ఆ జాబితాలో పార్టీ సీనియర్​ నేతలు జానా రెడ్డి, ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​ రావు ఠాక్రే వారితో మాట్లాడారు. అయితే, తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వారు వాపోయారు. సోమవారం జరిగిన మీటింగ్​లోనూ ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, రాహుల్​ గాంధీతో ఇదే విషయం చెప్పారు. 

జగ్గారెడ్డి కామెంట్లతో మరింత క్లారిటీ

పార్టీలో ఇంకా గొడవలు ఉన్నాయని చెప్పేందుకు ఎమ్మెల్యే జగ్గా రెడ్డి కామెంట్లు కూడా బలాన్ని చేకూర్చాయి. పార్టీలో అసలు ఐక్యత ఉందో లేదో తాను ఏమీ చెప్పలేనంటూ ఆయన కామెంట్​ చేశారు. నాలుగేండ్లుగా పార్టీ నేతలపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఢిల్లీలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్​ పార్టీకే ఎందుకో ఈ దరిద్రమని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారోనని అన్నారు. ఉత్తమ్​ బరస్ట్​ అవ్వడంలో బలమైన కారణమే ఉందని తేల్చి చెప్పారు. ఎవరితో మాట్లాడినా.. చెప్పుకున్నా పోయే సమస్య కాదన్నారు. అందుకే అన్ని విషయాలూ రాహుల్​ కు చెప్తానన్నారు. ఢిల్లీకి వెళ్లిన జగ్గారెడ్డితో రాహుల్​ గాంధీ కాసేపు ఒంటరిగా ముచ్చటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ కూడా ఆయనతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీలోని విభేదాలు, పరిస్థితులను రాహుల్​కు ​పూస గుచ్చినట్టు చెప్పినట్టు తెలుస్తున్నది. 

సీనియర్లపై రాహుల్​ సీరియస్​

కాంగ్రెస్​ ఎన్నికల వ్యూహ కమిటీ మీటింగ్​లో సీనియర్​ నేతలపై రాహుల్​ గాంధీ సీరియస్​ అయినట్టు తెలిసింది. ఉత్తమ్​ ఫిర్యాదుపై రేవంత్​ను వివరణ కోరినట్టు సమాచారం. ఏమైనా విభేదాలుంటే లోలోపలే పరిష్కరించుకోవాలని, బయటపెట్టుకోవద్దని కాస్త కఠువుగానే చెప్పారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఏదైనా ఉంటే పార్టీ రాష్ట్ర ఇన్​చార్జితో మాట్లాడాలని, లేదా తనతోనైనా నేరుగా మాట్లాడొచ్చని స్పష్టం చేసినట్టు చెప్తున్నారు. క్రమశిక్షణ తప్పి మాట్లాడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్టు సమాచారం. ఇగోలకు పోయి పార్టీకి నష్టం చేయొద్దని హితవు చెప్పినట్టు తెలిసింది. నేతల సొంత నియోజకవర్గాల్లో పార్టీ ప్రోగ్రెస్​ గురించి కూడా ఆరా తీసినట్టు తెలిసింది.