తుమ్మిడిహెట్టి పై పక్కా ప్లాన్ రెడీ చేయండి...మహారాష్ట్ర అభ్యంతరాలకు ఇంజనీరింగ్ పరిష్కారాలు చూపాలి: మంత్రి ఉత్తమ్ కుమార్

తుమ్మిడిహెట్టి పై పక్కా ప్లాన్ రెడీ చేయండి...మహారాష్ట్ర అభ్యంతరాలకు ఇంజనీరింగ్ పరిష్కారాలు చూపాలి: మంత్రి ఉత్తమ్ కుమార్
  •     సాగునీటి లక్ష్యం దెబ్బతినకుండా డిజైన్లలో మార్పులు
  •     వేర్వేరు ఎత్తుల్లో బ్యారేజీ నిర్మాణంతో ముంపుపై స్టడీ
  •     అటవీ, రెవెన్యూ భూములపై డిజిటల్ మ్యాపింగ్‌కు ఉత్తమ్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి ఎదురవుతున్న సాంకేతిక, పర్యావరణ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు కనుగొనాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తుతున్న ముంపు, పర్యావరణ అభ్యంతరాలను పరిష్కరించేలా పక్కా ఇంజనీరింగ్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఇటీవల ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఉన్నతస్థాయి చర్చల నేపథ్యంలో శనివారం జలసౌధలో ప్రాజెక్టు సాంకేతిక అంశాలు, అలైన్‌మెంట్లపై అధికారులతో సమీక్షించారు. 

బ్యారేజీని వేర్వేరు ఎత్తుల్లో నిర్మిస్తే ఎంత మేర ముంపు ఉంటుందో సమగ్రంగా అంచనా వేయాలని సూచించారు. నదీ పరివాహక ప్రాంతాలు, అటవీ భూములు, పర్యావరణ సున్నిత ప్రాంతాలు, రక్షిత కోర్ ఏరియాలు, రెవెన్యూ భూములు, గ్రామాలు, నివాస ప్రాంతాలను గుర్తిస్తూ డిజిటల్ మ్యాపులు రూపొందించాలని ఆదేశించారు. దీనివల్ల వాస్తవ ముంపు విస్తీర్ణంపై స్పష్టత వస్తుందన్నారు. సాగునీటి లక్ష్యాలకు విఘాతం కలగకుండా, పర్యావరణ ప్రభావం తగ్గేలా డిజైన్లలో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు.

152 మీటర్లకు ఎఫ్‌ఆర్‌ఎల్ పెంపు

నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలని ఇప్పటికే ప్రతిపాదించినట్లు ఉత్తమ్ తెలిపారు. అక్టోబర్ 26న ముంబైలో సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య జరిగిన సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించామన్నారు. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిల్వ సామర్థ్యం 2.182 టీఎంసీలే ఉంటుందని, 152 మీటర్లకు పెంచితే 5.697 టీఎంసీలకు చేరుతుందని వివరించారు. తుమ్మిడిహెట్టి నుంచి 77 టీఎంసీల నీటిని మళ్లించి, సుందిళ్ల బ్యారేజీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులతో అనుసంధానించడం ద్వారా ఏడు జిల్లాల్లోని 5.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ రూపొందించామన్నారు. తాజా అంచనాల ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 152 మీటర్లకు పెంచినా ముంపు ప్రభావం స్వల్పంగానే ఉంటుందని తెలిపారు. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ పునరావాసం, పునర్నిర్మాణ ప్రక్రియను సమర్థంగా చేపట్టవచ్చన్నారు. మహారాష్ట్రతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు.