
హైదరాబాద్: ఓయూ పట్ల సీఎం కేసీఆర్ నీచ బుద్ధితో వ్యవహరిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని.. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. ఓయూ విద్యార్థుల పోరాట ఫలితంగానే తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు. ఓయూ వేడుకల్లో మాట్లాడనివ్వలేదని కేసీఆర్ కక్ష గట్టారని.. ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ ఓయూను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు.
ఓయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పై కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఓయూ ప్రమాణాలను, భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పోలీస్ లు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని కోరుతున్నామని చెప్పారు. ఓయూ భూముల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పక్షాన పోరాడతామని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.