ఓటమి భయంతో మా అనుచరుల కిడ్నాప్​ ?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఓటమి భయంతో  మా అనుచరుల కిడ్నాప్​ ?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు : హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్ది తమ అనుచరులను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని కాంగ్రెస్ అభ్యర్థి, నల్లగొండ ఎంపీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్   పోలీసుస్టేషన్ లో మంగళవారం అర్ధరాత్రి  ఫిర్యాదు చేశారు. పిటిషన్​ ఇచ్చాక అక్కడే మీడియా తో ఉత్తమ్ మాట్లాడారు.  విజయవాడకి చెందిన చాణక్య అనే  సర్వే సంస్థతో తాము  ఫీల్డ్​వర్క్​ చేయిస్తున్నామని, ఈ క్రమంలో సర్వే టీం వెంట ఉన్నవాళ్లను ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆయన గన్ మెన్ల సహాయంతో కిడ్నాప్ చేసి కారులో బలవంతంగా కోదాడ రోడ్ లోని ఓ కాలనీ కి తీసుకువెళ్లారని, తమకు అనుకూలంగా పనిచేయాలని లేదంటే చంపేస్తామని టీం సభ్యులను బెదిరించారని ఉత్తమ్  ఆరోపించారు. 

వాళ్ల సెల్​ఫోన్లు లాక్కొని టీంలో ఉన్న మహిళలతో దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. ఈ విషయం సీఐకి తెలుసునని, ఆయన ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్​ ఆరోపించారు. ఎమ్మెల్యే గూండాలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఐ రామలింగారెడ్డి  రెండున్నరేళ్లుగా బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నారని, గతంలో కూడా పలుమార్లు  తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని వాపోయారు. 

ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు, పోలీసు​ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. కాగా, సర్వే టీం సభ్యుడు బండి రామస్వామి నుంచి కంప్లయింట్​ తీసుకొని విచారణ జరుపుతున్నామని సీఐ రామలింగారెడ్డి చెప్పారు.