బాయిల్డ్ రైస్ అదనపు కోటా కేటాయించాలి : మంత్రి ఉత్తమ్

బాయిల్డ్ రైస్ అదనపు కోటా కేటాయించాలి : మంత్రి ఉత్తమ్
  •     ఎఫ్​సీఐ సీఎండీ  ఆశుతోష్​తో మంత్రి ఉత్తమ్ భేటీ
  •     గోడౌన్ల నిర్మాణానికి పీఈజీ స్కీం పునరుద్ధరించాలని కోరిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి 2024–-25 యా సంగి సీజన్ కింద అదనంగా 10 లక్షల నుంచి 12 లక్షల  టన్నుల బాయిల్డ్ రైస్ కేటాయించాలని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎఫ్​సీఐ సీఎండీ ఆశుతోష్ అగ్నిహోత్రిని కోరారు. శనివారం సెక్రటేరియట్​లో మంత్రి ఉత్తమ్ తన ఆఫీసులో ఆశుతోష్ అగ్నిహోత్రితో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించారు. 

2024-–25 వానాకాలం మార్కెటింగ్ సీజన్ కోసం కేంద్రం 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ రైస్ టార్గెట్​గా నిర్ణయించగా, యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు 17.06 లక్షల టన్నులు బాయిల్డ్, 0.87 లక్షల టన్నుల రా రైస్ సరఫరా అయిందని, మిగిలిన 2.34 లక్షల టన్నుల బాయిల్డ్, 14.26 లక్షల టన్నుల రా రైస్ సరఫరా చేయాల్సి ఉందని మంత్రి వివరించారు. 

యాసంగిలో బాయిల్డ్ రైస్‌‌‌‌‌‌‌‌కు అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అదనంగా 10 లక్షల  టన్నుల బాయిల్డ్ రైస్ కేటాయించాలని, ఫిబ్రవరి 2026 నాటికి రాష్ట్ర ప్రభుత్వం 18 లక్షల టన్నుల బియ్యం తీసుకోవాల్సి ఉన్నందున 10 లక్షల నుంచి -12 లక్షల టన్నుల అదనపు కోటా అవసరమని మంత్రి చెప్పారు. బాయిల్డ్ రైస్ తరలింపు కోసం అదనపు రైల్వే రేక్​లు కేటాయించాలన్నారు. ఈ ఏడా ది జనవరి- నుంచి నవంబర్ మధ్య గతేడాదితో పోలిస్తే 13.5 లక్షల టన్నులు రైల్వే రేక్​ల తరలింపు కొరత ఏర్పడినట్టు ఆశుతోష్​కు మంత్రి వివరించారు.

చర్చలో లేవనెత్తిన కీలకాంశాలు..

2024-–25 వానాకాలం సీఎంఆర్ డెలివరీ గడువు నవంబర్​12తో ముగియగా ఇంకా 2.27 లక్షల టన్నులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న నేపథ్యంలో మరో 60 రోజులు పొడగించాలని కోరారు. రాష్ట్రంలో నిల్వ సామర్థ్యం 65 లక్షల టన్నులు మాత్రమే ఉండటం, ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ అద్దె గోడౌన్లపై పరిమితులు ఉండటంతో సీఎంఆర్ డెలివరీలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు.  

ఎఫ్​సీఐ ద్వారా అదనంగా 15 లక్షల టన్నులు నిల్వ సామర్థ్యం మంజూరు చేయాలని కోరారు. -మిల్లర్లు కొత్త ధాన్యం సేకరణలో వెనుకాడుతున్నారు, మిల్లుల వద్ద స్థలం లేకపోవడం ప్రధాన కారణమని తెలిపారు. 

మరిన్ని గోదాములు నిర్మించుకోవడానికి పీఈజీ పథకాన్ని పునరుద్ధరించి ఏడెనిమిదేళ్ల హామీతో (రెండేండ్ల రాష్ట్ర హామీ + ఆరేండ్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ హామీ) ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణం చేపట్టాలన్నారు. ఇలా చేస్తే నెలకు 0.5 లక్షల టన్నుల చొప్పున నాలుగు నెలల్లో అదనంగా తరలింపు సాధ్యమని మంత్రి సూచించారు.  ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ అధికారులు రాష్ట్ర ప్రతినిధులతో కలిసి అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది.