- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, వెలుగు : కాంగ్రెస్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా జరుగుతున్నాయని ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణంలోని ప్రధాన రహదారులపై మంత్రి మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలను పలకరించారు. ఇందిరా సెంటర్ రోడ్డు ప్రక్కన ఉన్న టీ స్టాల్ వద్ద టీ తాగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు నియంతృత్వ ధోరణిలో ఏకపక్షంగా, వారికి అనుకూలంగా కొనసాగించారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చరిత్రలో ఎవరూ ఏ రాష్ట్రంలో అమలు చేయలేదన్నారు.
కాంగ్రెస్ ప్రజా పాలనకు గ్రామాల్లో ప్రజల మద్దతు పూర్తిగా లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థుల గెలుపును ప్రజలే నిర్ణయించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి గెల్లి రవి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డీసీబీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జునరావు, మున్సిపల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ జక్కుల నరేందర్, శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి పాటు పడాలి..
గ్రామాల అభివృద్ధికి సర్పంచులు పాటుపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. మంత్రి ఉత్తమ్ సొంత గ్రామమైన తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో 510 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి బోయపల్లి కిషన్, ఉప సర్పంచ్ గా గెలిచిన బోనాసి ఎల్లమ్మ సోమయ్యలు హుజూర్ నగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
