నన్ను పార్టీ నుంచి.. గెంటేయాలని చూస్తున్నరు

నన్ను పార్టీ నుంచి.. గెంటేయాలని చూస్తున్నరు
  • ఓ కీలక నేత కావాలనే దుష్ప్రచారం చేస్తున్నరు: ఉత్తమ్
  • బీఆర్ఎస్​లో చేరుతున్నామన్న వార్తలు అవాస్తవం
  • తమ సర్వస్వం కాంగ్రెస్​ పార్టీకేనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తాను, తన భార్య కాంగ్రెస్​ను వీడి బీఆర్ఎస్​లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కాంగ్రెస్​ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ​పార్టీని వీడట్లేదని తేల్చిచెప్పారు. తాము పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఆయన, తన భార్యతో కలిసి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 30 ఏండ్లుగా కాంగ్రెస్​ పార్టీలో విధేయుడిగా పనిచేస్తున్నానని ఉత్తమ్​చెప్పారు. 1994 నుంచి వరుసగా ఆరు సార్లు ఎన్నికల్లో గెలిచానన్నారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయినా.. తన భార్య కోదాడలోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పారు. ‘‘నేను, నా భార్య పద్మావతి సర్వస్వం పార్టీ కోసమే ధారపోశాం. 

మా జీవితం, మా ఆస్తులు, మా ఆరోగ్యం, మా కుటుంబ జీవితం, మా సర్వస్వం.. పార్టీకి, ప్రజాసేవకే అంకితం చేశాం. అలాంటి మాపై పార్టీ మారుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. రెండేండ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతున్నది. పార్టీలో కీలక పొజిషన్​లో ఉన్న ఓ లీడర్​ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ నేతకు కావాల్సిన యూట్యూబ్​ చానళ్లు, మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. పార్టీ నుంచి మమ్మల్ని, మా అనుచరులను తరిమేసే కుట్రలో భాగంగా ఇలా చేస్తున్నారు’’ అని ఉత్తమ్​పేర్కొన్నారు.  

నాకు ఏ ప్రభుత్వంతోనూ వ్యాపార లింకుల్లేవ్​..

పార్టీలో జరుగుతున్న వివిధ అంశాలపై తమకు కాస్తంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని, అలాగని తప్పుడు ప్రచారాలు చేయడం తగదని ఉత్తమ్​ అన్నారు. పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం ప్రకారమే తాను నడుచుకుంటానని తేల్చి చెప్పారు. తాను సీఎం కేసీఆర్​ను ఇప్పటిదాకా కలిసింది లేదని స్పష్టం చేశారు. తనకు ఏ ప్రభుత్వంతోనూ వ్యాపారాలు, కాంట్రాక్ట్​లు, ల్యాండ్​ డీలింగ్స్​కు సంబంధించిన వ్యాపారాలేవీ లేవని పేర్కొన్నారు. ‘‘చైనా, పాకిస్తాన్​ సరిహద్దుల్లో దేశం కోసం పోరాడాను. 

వాయుసేనలో సేవలందించాను. దేశం కోసం సేవ చేసే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నా. ఎయిర్​ఫోర్స్​ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి రాష్ట్రపతులు ఆర్​. వెంకటరామన్​, శంకర్​ దయాళ్​ శర్మల వద్ద సీనియర్​ ఆఫీసర్​గా పనిచేశాను. వాలంటరీ రిటైర్మెంట్​ తీసుకుని కాంగ్రెస్​ పార్టీలో చేరాను. అప్పటి నుంచి ప్రజా సేవలోనే ఉన్నా’’ అని ఉత్తమ్​ పేర్కొన్నారు.