50 వేల మెజార్టీ రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా:ఉత్తమ్ కుమార్​రెడ్డి

50 వేల మెజార్టీ రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా:ఉత్తమ్ కుమార్​రెడ్డి

కోదాడ, వెలుగు: దేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చానని,  పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని  కొమరబండ వద్ద మామిడి తోటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. రెండు నియోజకవర్గాల్లో 50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటామన్నారు.

ప్రస్తుతం జిల్లాలో అధికారులు జిల్లా అధికారుల్లా ప్రవర్తించడం లేదని, పోయేకాలం వచ్చినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారని మండిపడ్డారు.  ప్రజలు నిశ్శబ్దంగా గమనిస్తున్నారని, త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆత్మీయ సమ్మేళనానికి 10,000 మంది స్వచ్ఛందంగా తరలిరావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కొందరు కావాలని తనపై  దుష్ప్రచారం చేస్తున్నారని , దీనిని కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.  ఐదుసార్లు ఎమ్మెల్యేగా , మంత్రిగా, ఎంపీగా, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన తనకు ఎక్కడా సొంత ఇల్లు లేదని, ఒకసారి ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి రూ. 8 కోట్లతో ఇల్లు కడుతున్నాడని విమర్శించారు. ఆత్మీయ సమ్మేళనంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి, గద్దర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.