రైతుల పేరుతో డ్రామాలా?..శవ రాజకీయాలు మానుకోవాలి..కేటీఆర్‌‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్

రైతుల పేరుతో డ్రామాలా?..శవ రాజకీయాలు మానుకోవాలి..కేటీఆర్‌‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్
  • ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేస్తున్నామని వెల్లడి
  • బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు రైతుల పేరు తో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని  సివిల్​ సప్లయ్స్​ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్​ చేసిన వ్యాఖ్యల్లో రాజకీయ నిరాశ, అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో మంత్రి విమర్శించారు. రైతుల మరణాలను రాజకీయాలకు వాడుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.

నిజానిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం బీఆర్ఎస్​ నేతలకు అలవాటైందని, పదేళ్ల పాలనలో రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిన వారే ఇప్పుడు వారిపై కపట ప్రేమ చూపుతున్నామని ఎద్దేవా చేశారు. “మాది ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం. రైతులను తప్పుదోవ పట్టించే రాజకీయ నాటకాలను తెలంగాణ సమాజం నమ్మదు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగుతోంది.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి చెల్లింపుల వరకు ప్రతి అంశాన్ని ప్రజల ముందుంచుతున్నాం. రైతుల్లో గందరగోళం సృష్టించి రాజకీయ లబ్ధి పొందడమే కేటీఆర్  లక్ష్యంగా కనిపిస్తోంది” అని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్​ పాలనలో కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, మిల్లర్లతో కుమ్మక్కు, రైతుల దోపిడీ జరిగాయని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.

బీఆర్ఎస్​ పాలన కంటే మెరుగే

ధాన్యం కొనుగోళ్లు 2021–22 యాసంగి సీజన్‌‌లో నాటి బీఆర్ఎస్​ ప్రభుత్వం మే 22 నాటికి రూ.5,239 కోట్ల విలువైన 26.78 లక్షల  టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.2,624 కోట్లు మాత్రమే చెల్లించిందని మంత్రి తెలిపారు. 2022–-23 యాసంగిలో రూ.7,530 కోట్ల విలువైన 36.63 లక్షల  టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.3,160 కోట్లు చెల్లించిందన్నారు.  తమ పార్టీ అధికారంలోకి వచ్చాక 2023–24 యాసంగిలో రూ.8,691 కోట్ల విలువైన 39.51 లక్షల  టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.6,112 కోట్లు చెల్లించిందని వివరించారు.

2024–-25 యాసంగిలో రూ.14,010 కోట్ల విలువైన 60.44 లక్షల   టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.10,882 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ప్రస్తుత యాసంగి సీజన్‌‌లో మే 22 నాటికి రూ.11,499 కోట్ల విలువైన 48.21 లక్షల మెట్రిక్  టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.8,203 కోట్లు చెల్లించామని వెల్లడించారు.

గన్నీ సంచుల కొరత లేదు

గన్నీ సంచుల కొరతపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్​ ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా 20.86 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు 14.12 కోట్ల గన్నీ బ్యాగులు సరఫరా చేశామని, వాటిలో 11.03 కోట్లను వినియోగించామని తెలిపారు. ఇంకా కేంద్రాల్లో 3 కోట్లకు పైగా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా, జిల్లా కేంద్రాల్లో అదనంగా 67 లక్షలకు పైగా నిల్వ ఉంచామని పేర్కొన్నారు.

ధాన్యం తరలింపుకు 1,300 వాహనాలను వియోగిస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణను దేశంలోనే ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో నంబర్ వన్‌‌గా నిలిపింది కాంగ్రెస్  ప్రభుత్వమేనని మంత్రి పేర్కొన్నారు.