- ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు అపోహలు సృష్టిస్తున్నారు: ఉత్తమ్
- ఏపీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు న్యాయపోరాటం చేస్తాం
- ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడాన్నీ అంగీకరించబోమన్న మంత్రి
కోదాడ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్స్ శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తూ, ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.
బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల నిర్మాణాన్ని గట్టిగా ప్రతిఘటిస్తోందని తెలిపారు. బనకచర్ల నిర్మాణంపై కేంద్ర జలశక్తి మంత్రికి తాను స్వయంగా, లేఖల ద్వారా అభ్యంతరాలను తెలిపామన్నారు.
అలాగే కర్నాటకలోని ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడాన్నీ అంగీకరించబోమని, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ, ఏపీలో కూటమి ప్రభుత్వాలు ఉన్నాయని.. అయినా కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదన్నారు. కృష్ణా జలాల్లో 70 శాతం వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.
కృష్ణా జల వివాదాల విషయంలో ట్రిబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు ట్రిబ్యునల్ కు స్వయంగా హాజరయ్యానని, మంత్రి హోదాలో ట్రిబ్యునల్ కు హాజరైన మొదటి వ్యక్తిని తానేనని వివరించారు. కృష్ణా జలాల్లో ఏపీకి 811 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకున్న చరిత్ర బీఆర్ఎస్ పాలకులదని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం..
బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల రంగంపై భారీగా ఖర్చు పెట్టినా సాధించింది ఏమి లేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరంతో సాగులోకి వచ్చింది నామమాత్రపు ఆయకట్టేనన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను తాము ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో కల్వకుర్తి, దేవాదుల, నెట్టేంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని మండిపడ్డారు.
డిండి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ పాలకులు కనీసం నీటి కేటాయింపులు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసిందన్నారు. సూర్యాపేట జిల్లాకు దేవాదుల నీరు పారించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్నారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ సంచలన రికార్డ్ నమోదు చేసిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్ల పాటు రానంత దిగుబడి ఈ రెండేళ్లలో వచ్చిందన్నారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్లే ఇంతటి దిగుబడి సాధ్యం అయిందన్నారు. ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
