దేవుడినే మాయం చేసిన పూజారి.. 400 ఏళ్ల నాటి విగ్రహాలతో

దేవుడినే మాయం చేసిన పూజారి.. 400 ఏళ్ల నాటి విగ్రహాలతో

ఉత్తరప్రదేశ్లోని ఓ పూజారి దేవుడకే శఠగోపం పెట్టాడు. ధూపదీప నైవేధ్యాలు సమర్పించే పూజారి..దేవుడి విగ్రహాలు మాయం చేశాడు. ఆగ్రాలోని జాత్‌పురా ప్రాంతంలో ఉన్న శ్రీరామ మందిరంలో దాదాపు 400 ఏళ్ల నాటి నాలుగు విగ్రహాలు కనిపించడం లేదు. అయితే ఈ విగ్రహాలను ఆలయ పూజారి చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయనపై  ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేశారు. 

అసలు కథేంటి..

ఆగ్రాలోని జాత్‌పురా ప్రాంతంలో ఉన్న శ్రీరామ మందిరాన్ని 400 ఏళ్ల క్రితం  మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలోని మంత్రి రాజా తోడర్మల్ నిర్మించారు. అలాగే విలువైన లోహాలతో చేసిన శ్రీసీతారామలక్ష్మణ అంజనేయుల విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే ప్రస్తుతం ఈ ఆలయానికి పూజారిగా పూజారి ఆచార్య దీప్మణి శుక్లా ఉన్నారు. నిన్నటి వరకు ఆలయంలో ఉన్న విగ్రహాలు రాత్రికి రాత్రమే మాయమయ్యాయి. 

పూజారిపై అనుమానం...

విగ్రహాలు చోరీకి గురయ్యాయని తెలుసుకున్న ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు.. ఆలయ పూజారి, అతని భార్యను నిలదీశారు. వారు పొంతనలేని సమాధానంతో పాటు..అనుమానంగా ప్రవర్తించడంతో...పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు ఆలయ పూజారి ఆచార్య దీప్మణి శుక్లా, ఆయన భార్యపై ఐపీసీ 379తో పాటు ఇతర  సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.., విగ్రహాల ఆచూకీ కనుగొనేందుకు ఆరా తీస్తున్నామని ఏసీపీ గిరీష్ కుమార్ వెల్లడించారు.

నాకేం తెలియదు..

శ్రీరామ మందిరంలోని 400 ఏళ్ల నాటి విగ్రహాలు మాయమడంపై ఆలయ పుజారి ఆచార్య దీప్మణి శుక్లా స్పందించారు. విగ్రహాలు ఎలా మాయం అయ్యాయో తనకు తెలియదని..కావాలనే తనపై ఆలయ కమిటీ కుట్ర చేసి దొంగతనం కేసు పెట్టించారని మండిపడ్డారు.