చిరుత దాడిలో 8 ఏండ్ల బాలిక మృతి

చిరుత దాడిలో 8 ఏండ్ల బాలిక మృతి

లక్నో :  ఉత్తరప్రదేశ్‌‌లోని బల్‌‌రాంపూర్ జిల్లాలో  ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. భగవాన్‌‌పూర్ కోదర్ గ్రామంలోని సుహెల్వా అటవీ ప్రాంతంలో తోటి పిల్లలతో ఆడుకుంటున్న ఎనిమిదేండ్ల బాలికపై చిరుతపులి దాడిచేసి చంపింది. స్థానికంగా నివసించే  చంద్రప్రకాశ్ దంపతులకు అనుష్క(8) అనే కూతురు ఉంది. ఆదివారం ఆమె తన ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి గ్రామానికి సమీపంలో ఉన్న అడవి దగ్గరకు వెళ్లింది. అప్పటికే అక్కడి పొదల్లో దాక్కున్న చిరుతపులి ఒక్కసారిగా అనుష్కపై  అటాక్ చేసింది. చిన్నారిని నోట కరుచుకుని  అడవిలోకి ఈడ్చుకెళ్లింది. ఇది చూసిన తోటి పిల్లలంతా భయంతో కేకలు వేశారు. ఆ కేకలు విని గ్రామస్థులు బాలికను కాపాడేందుకు చిరుత వైపు పరుగులు తీశారు.

అయితే, అప్పటికే బాలికను చిరుత అడవిలోపలికి తీసుకెళ్లిపోయింది. స్థానికుల ఫిర్యాదుతో  అనుష్క ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.  అర్ధరాత్రి అటవీలోపల బాలిక మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహానికి పోస్టుమార్టం జరిపిస్తున్నామని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆర్కే మిట్టల్ తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందజేస్తామన్నారు. చిరుత ఆచూకీ కోసం  రెండు బృందాలను నియమించామని చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ లో  డ్రోన్ కెమెరాలను వాడుతున్నట్లు వెల్లడించారు.  పిల్లలను రాత్రిపూట ఒంటరిగా బయటకు పంపవద్దని  గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.