అల్లాద్దీన్ దీపం పేరుతో రూ.2.5 కోట్లకు టోకరా

అల్లాద్దీన్ దీపం పేరుతో రూ.2.5 కోట్లకు టోకరా

మీరఠ్: అల్లాద్దీన్ దీపం పేరుతో ఉత్తర్ ప్రదేశ్‌‌లోని మీరఠ్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మోసానికి పాల్పడ్డారు. మహిమలు కలిగిన అల్లాద్దీన్ దీపం ఇదేనంటూ ఓ డాక్టర్ వద్ద నుంచి సదరు వ్యక్తులు రూ.2.5 కోట్లను సేకరించారు. మోసానికి పాల్పడిన వారిని ఇక్రముద్దీన్, అనీస్‌‌గా పోలీసులు గుర్తించారు. మోసానికి గురైన వ్యక్తిని డాక్టర్ లైక్ ఖాన్‌‌గా గుర్తించారు. రీసెంట్‌‌గా యూకే నుంచి వచ్చిన ఖాన్‌ కొన్నేళ్ల నుంచి మంత్రవిద్యను అభ్యసిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

‘నిందితులు డాక్టర్ ఖాన్‌‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేయలేదు. తాము ఏ సమస్యనైనా పరిష్కరిస్తామంటూ కొందరు కస్టమర్లకు విజిటింగ్ కార్డ్స్ పంచారు. కస్టమర్లలో నమ్మకాన్ని పెంచుకోవడానికి కొందరికి డబ్బు రిటర్న్ ఇచ్చారు. తమ దగ్గర ఏ కోరికలనైనా తీర్చే మహిమలు కలిగిన అల్లాద్దీన్ దీపం ఉందని కస్టమర్లకు నమ్మబలికారు. అసలైన అల్లాద్దీన్ దీపం రూ.2.5 కోట్ల విలువ ఉంటుందని, డిస్కౌంట్ ప్రైజ్‌‌తో రూ.70 లక్షలకే అందిస్తామని ఆఫర్ చేశారు. ఈ దీపాన్ని రెండేళ్లపాటు వాడకూడదని, వాడితే ఫ్యామిలీలో అనుకోని ఘటనలు జరుగుతాయని డాక్టర్ ఖాన్‌‌ను నిందితులు హెచ్చరించారు’ అని బ్రంపురి పోలీసు స్టేషన్ ఎస్‌‌హెచ్‌‌వో సుభాష్ అత్రి చెప్పారు.

‘నా కొడుకు అనారోగ్యంగా ఉండటంతో అతడ్ని మీరట్‌‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చా. అతడి పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని మరో ఆస్పత్రికి మార్చాలనుకున్నాం. ఈ సమయంలో ఇక్రముద్దీన్, అనీస్ నన్ను భయపెట్టారు. నా కొడుకును తామే శపించామని.. రూ.50 లక్షలు ఇవ్వకపోతే మిగిలిన కుటుంబీకులను కూడా శపిస్తామని బెదిరించారు. గత కొన్ని రోజులుగా ఏదో పదార్థం తినిపిస్తూ.. నన్ను వారు తమ కంట్రోల్‌‌లో ఉంచుకున్నారు’ అని ఖాన్ పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను ఐపీసీ సెక్షన్లు 386, 420 (చీటింగ్) కింద పోలీసులు అరెస్టు చేశారు.