రోడ్డుపైకి ఈడ్చి చితకొట్టిన పోలీసులు

రోడ్డుపైకి ఈడ్చి చితకొట్టిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ లోని సిద్దార్థ్ నగర్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. రోడ్డుపై ఓ వ్యక్తిని ఈడ్చటమే కాకుండా విచక్షణా రహితంగా కొట్టారు. ఈ వీడియో వైరల్ కావటంతో.. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

గురువారం మధ్యాహ్నం సమయంలో సిద్ధార్ద్‌ నగర్‌ జిల్లాలోని నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో ఓ యువకుడు బైక్‌పై వెళ్తూ పోలీసుల కంటబడ్డాడు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించావంటూ ఆ ఇద్దరు పోలీసులు యువకుడి బైక్‌ను నిలిపి వేశారు.ఈ క్రమంలో యువకుడికి, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన పోలీసులు యువకుడిపై దాడికి దిగారు. రోడ్డుపైకి ఈడ్చుతూ, కాళ్లతో తన్నారు. అసలు చేసిన తప్పేంటో చెప్పండి అంటున్నా వినకుండా దాడికి పాల్పడ్డారు పోలీసులు. పోలీసులు యువకుడిపై దాడి చేస్తుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి మొబైల్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీడియో పై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు..ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేసి.. దర్యాప్తునకు ఆదేశించారు.