ఉత్తరప్రదేశ్​లో మరో ఘోరం.. బాలికను రైలుకిందకు తోసిన్రు

ఉత్తరప్రదేశ్​లో మరో ఘోరం.. బాలికను రైలుకిందకు తోసిన్రు
  • రెండు కాళ్లూ.. ఓ చెయ్యి కోల్పోయిన బాధితురాలు
  • వేధింపులు అడ్డుకోవడంతో యువకుల దుశ్చర్య
  • సీఎం యోగి సీరియస్

బరేలీ: ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ మైనర్ పై ఇద్దరు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో రైలు కింద తోసేశారు. దీంతో బాధితురాలు రెండు కాళ్లు, ఒక చెయ్యి కోల్పోయింది. తీవ్రగాయాలపాలైన ఆమె.. ఆస్పత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. 

బరేలీ సిటీలోని సీబీ గంజ్ ఏరియాకు చెందిన బాలిక(17) ఇంటర్ చదువుతోంది. రోజూ ట్యూషన్​కు వెళ్లే సమయంలో అదే ఏరియాకు చెందిన యువకులు ఇద్దరు వెంటపడి వేధిస్తున్నారు. విషయం ఇంట్లో చెప్పగా.. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు చర్యలు తీసుకోకపోవడంతో వేధింపులకు పాల్పడుతున్న వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొన్ని రోజులు సైలెంట్​గా ఉన్న యువకులు.. మళ్లీ గత వారం నుంచి బాలిక వెంట పడుతున్నారు. 

ట్యూషన్ కు వెళ్లొస్తుండగా అడ్డుకుని.. 

ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం బాలిక ట్యూషన్ కు వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో రైల్వే క్రాసింగ్ వద్ద ఇద్దరు యువకులు ఆమెను అడ్డుకున్నారు. లైంగికంగా వేధించారు. బాలిక ప్రతిఘటించడంతో రైలు కిందకు తోసేశారు. కూతురు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు వెతకగా, రైల్వే ట్రాక్ వద్ద రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి రెండు కాళ్లతో పాటు ఎడమ చెయ్యి పోయిందని డాక్టర్లు చెప్పారు. ఇంకా చాలా చోట్ల ఫ్రాక్చర్స్ అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి సీరియస్ గా ఉందని పేర్కొన్నారు. 

సీఎం యోగి సీరియస్.. 

ఈ ఘటనను సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ గా తీసుకున్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ట్రీట్ మెంట్ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. కాగా,  బాలికను వేధించిన నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ చెప్పారు. అదేవిధంగా సీబీ గంజ్​ స్టేషన్ ఎస్సైతో పాటు , ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామన్నారు.