కాన్పూర్ లో 66 కు చేరిన జికా వైరస్ కేసులు

 కాన్పూర్ లో 66 కు చేరిన జికా వైరస్ కేసులు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజు కూ పెరుగుతూ పోతోంది. లేటెస్టుగా  అక్కడ మరో 30 మందికి ఈ వైరస్‌ సోకడంతో కాన్పూర్‌లో మొత్తం జికా కేసుల సంఖ్య 66కి చేరుకుంది. వీరిలో 45 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కాన్పూర్‌లో అక్టోబరు 24న  మొదటి  జికా కేసు నమోదైంది. వాయుసేనలో పనిచేసే ఓ అధికారి కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతూ వాయుసేన ఆస్పత్రిలో చేరారు. ఆయన  దగ్గర నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని ప్రయోగశాలకు పంపించగా.. జికా వైరస్‌ బారినపడినట్లు తేలింది. దీంతో అలర్టైన అధికారులు ఆ అధికారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొదలుపెట్టి వారి రక్తనమూనాలను పరీక్షించారు. ఐఏఎఫ్‌ స్టేషన్‌ పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా పరీక్షలు చేశారు. వీరిలో ఇప్పటివరకు 66 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆశా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జికా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి చికిత్స అందిస్తున్నారు. వీధుల్లో శానిటైజేషన్‌, యాంటీ లార్వా స్ప్రే చేస్తున్నారు.