గొర్రు కొట్టి.. వరి నాట్లు వేసి..పొలం పనులు చేసిన ఉత్తరాఖండ్ సీఎం ధామి

గొర్రు కొట్టి..  వరి నాట్లు వేసి..పొలం పనులు చేసిన ఉత్తరాఖండ్ సీఎం ధామి
  • సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ 

న్యూఢిల్లీ: ఎల్లప్పుడూ వరుస సమావేశాలు, సమీక్షలతో కొంచెం కూడా తీరిక లేని బిజీ లైఫ్ తో ఉండే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రైతుగా మారారు. సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూ తన సొంత పొలంలో పూజలు చేసి, కాసేపు పనులు చేశారు. గొర్రు కొట్టి.. కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. 

శనివారం ఉత్తరాఖండ్ ఖతిమా టౌన్ సమీపంలోని నాగ్రా తెరాయ్ గ్రామంలోని తన సొంత పొలానికి వెళ్లిన ధామి.. ముందుగా రైతులు పాటించే హుడ్కియా బౌల్ సంప్రదాయం ప్రకారం భూమాత, వరుణుడు, మేఘాలకు పూజలు చేశారు. 

భక్తి పాటలతో చిన్న డోలును వాయిస్తూ కళాకారులు గానం చేస్తుండగా పొలం పనుల్లోకి దిగారు. కాడెద్దులను కట్టి గొర్రు కొట్టి పొలాన్ని చదును చేశారు. అనంతరం కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు.  ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సీఎం ధామి తన ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాతాలో షేర్ చేయగా, ఇవి వైరల్ అయ్యాయి.

 ‘‘వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడం ద్వారా రైతుల కృషి, త్యాగం, అంకితభావాన్ని స్వయంగా తెలుసుకున్నాను. మరోసారి పాత రోజులు గుర్తుకువచ్చాయి. రైతులు.. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదు.. భావితరాలకు మన సంస్కృతిని అందించే వారధులు’’ అని కొనియాడుతూ ఆయన ట్వీట్ చేశారు.