- ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.8,749 కోట్లు జమ
- ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ టాప్
- తరుగు పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్యలు
- వారం, పది రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశం
- ధాన్యం కొనుగోళ్లపై చీఫ్ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు: రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్‌లో రూ.20 వేల నుంచి రూ.22 వేల కోట్ల వరకు నిధులు కేటాయిస్తున్నదని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. రెండు సీజన్ల పంటల కొనుగోళ్ల కోసం ఏటా రూ.42 వేల నుంచి రూ.45 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోందని తెలిపారు.
ఈ స్థాయిలో వరి ధాన్యం కొనుగోళ్లు స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని అన్నారు. ప్రతి జిల్లాలో వారం నుంచి పది రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లైస్ భవన్‌నుంచి చీఫ్ విప్ ఆది శ్రీనివాస్, కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, సివిల్ సప్లైస్ ఆఫీసర్లతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
తాలు, తరుగు పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతును నష్టపరిచే ఏ చర్యను ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు చేర్చాలని, రవాణాకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణలో ఇబ్బందులకు హమాలీల కొరత ప్రధాన కారణమని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం 80 నుంచి 90 శాతం మంది హమాలీలు పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి వస్తున్నారని, బెంగాల్ ఎన్నికలు, బిహార్‌లో గోధుమ పంట సీజన్ పొడిగింపుతో కొంత ఆలస్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో స్థానిక కార్మికులు తక్కువగా ఉండటంతో సేకరణ ప్రక్రియ మందగించిందని, ప్రస్తుతం దాన్ని వేగవంతం చేసే చర్యలు చేపట్టామని చెప్పారు.
తెలంగాణ టాప్
దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ టాప్‌లో నిలిచిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. యాసంగి సీజన్‌లోనే 141 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని, రెండు సీజన్లలో కలిపి మొత్తం 300 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.75 వేల కోట్లకు చేరుతుందని వివరించారు. ఈ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 70 నుంచి 75 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తోందని, అందులో 52 లక్షల టన్నులను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు.
అయితే కేంద్రం కేవలం కనీస మద్దతు ధరకు మాత్రమే పరిమితమవుతోందని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా సేకరించడం లేదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం వేల సంఖ్యలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం విస్తృతస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందన్నారు. ఇప్పటివరకు 58.7 లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తికాగా, రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.8,749 కోట్లు జమ చేసినట్టు వెల్లడించారు.
ధాన్యం సేకరణ కోసం 20.80 కోట్ల గన్నీ బ్యాగులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. రైతులకు అండగా నిలిచేది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
రైతులకు, వినియోగదారులకు ప్రభుత్వం మేలు: తూడి దేవేందర్‌రెడ్డి
రాష్ట్రంలో పండుతున్న ధాన్యాన్ని సేకరించడంతోపాటు ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ ప్రభుత్వం రైతులకు, వినియోగదారులకు మేలు చేస్తోందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ తూడి దేవెందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సన్నాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వరి ఉత్పత్తి కీలక పాత్ర పోషిస్తోందని, అధికంగా పండుతున్న ధాన్యంతో బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు కిలోకు రూ.40 వరకు తగ్గాయని వివరించారు.
దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తున్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ ప్రాంతాలనుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు.
