సీఎంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్​గా వి.లచ్చిరెడ్డి

సీఎంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్​గా వి.లచ్చిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: డిప్యూటీ కలెక్టర్ వి.లచ్చిరెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.  సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా ఆయనను నియమిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నాళ్లుగా ఆ పోస్టులో పని చేస్తోన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేస్తూ.. రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. 1992 బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన లచ్చిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు.

2017లో రికార్డుల ప్రక్షాళన సమయంలో లచ్చిరెడ్డి కీసర ఆర్డీవోగా ఉంటూ పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి రిపోర్ట్ అందించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు విజయవంతం చేయడానికి కృషి చేశారు. ఐతే ఆర్టీసీ సమ్మె కాలంలో కార్మికులకు రెవెన్యూ ఉద్యోగ సంఘం తరఫున మద్దతు తెలిపారు. ఇది నచ్చని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. దీంతో ఆయన నాలుగు ఏండ్లుగా సెలవులో ఉన్నారు. ఈ కాలంలోనే ఆయన ధరణి పోర్టల్ వైఫల్యాలు, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అక్రమాల గురించి బహిరంగంగానే విమర్శలు చేశారు. సభలు, సమావేశాల్లో సాంకేతిక లోపాలపై ఆధారాలతో సహా వివరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే లచ్చిరెడ్డి విధుల్లో చేరారు. వీఆర్​ఏల సమస్యలు, ధరణిలో లోపాల సవరణకు పలు సూచనలు చేశారు.