కరోనా సోకినోళ్లకు 9 నెలల తర్వాతే టీకా

కరోనా సోకినోళ్లకు 9 నెలల తర్వాతే టీకా
  • కరోనా నుంచి కోలుకున్నంక 9 నెలల తర్వాతే టీకా
  • ప్రభుత్వ ప్యానెల్​ సూచన

న్యూఢిల్లీ: కరోనా బారిన పడి కోలుకున్నంక వ్యాక్సిన్​ తీసుకోవడానికి తొందరపడొద్దని ప్రభుత్వం నియమించిన ప్యానెల్​ ప్రజలకు సూచించింది. వైరస్​ నుంచి కోలుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయని నేషనల్​ టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ ఆన్​ ఇమ్యునైజేషన్(ఎన్టీఏజీఐ) పేర్కొంది. గతంలో ఇదే ప్యానెల్​ వైరస్​ నుంచి కోలుకున్నంక వ్యాక్సినేషన్​కు ఆరు నెలల గ్యాప్​ ఉండాలని చెప్పింది. తాజాగా ఈ గ్యాప్​ను తొమ్మిది నెలలకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనివల్ల వ్యాక్సిన్​ ప్రభావం మరింతగా పెరుగుతుందని చెప్పింది. దీంతో పాటు గర్భంతో ఉన్న వాళ్లు, పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్​ వేసుకోవచ్చని ప్యానెల్​ పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇప్పుడు అమలుచేస్తున్న ప్రొటోకాల్​ ప్రకారం.. కరోనా బారినపడి కోలుకున్నోళ్లు వ్యాక్సినేషన్​ కోసం నాలుగు నుంచి ఎనిమిది వారాల పాటు ఆగాలి. ప్రెగ్నెంట్, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్​ వేయొద్దు. కరోనా వ్యాక్సిన్లను గర్భవతులు, పాలిచ్చే తల్లులపై పరీక్షించి చూడకపోవడంతో ప్రభుత్వం వారిని వ్యాక్సినేషన్​కు దూరం పెట్టింది. కాగా, వ్యాక్సిన్​ కొరత వల్ల చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ మందగించిన ప్రస్తుత పరిస్థితిలో ఎన్​టీఏజీఐ ఈ సూచనలు చేయడం గమనార్హం. మరోవైపు, వ్యాక్సినేషన్​కు వచ్చే వాళ్లకు ముందుగా ర్యాపిడ్​ యాంటీజెన్​ టెస్ట్​ చేయాలన్న ప్రతిపాదనను ప్యానెల్​ తోసిపుచ్చింది.