స్లోగా వ్యాక్సినేషన్..సౌత్‌లో మన రాష్ట్రమే లాస్ట్

V6 Velugu Posted on Oct 17, 2021

  • దేశంలో టాప్‌‌ టెన్‌‌లో కూడా లేదు
  • 2.84 కోట్ల డోసులతో 13వ స్థానం
  • తొలి మూడు ప్లేసుల్లో యూపీ, మహారాష్ట్ర, గుజరాత్​ 
  • కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ డేటాలో వెల్లడి.

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ స్లోగా సాగుతోంది. ఇప్పటిదాకా 2.84 కోట్ల డోసుల టీకానే వేశారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్​టెన్​లో కూడా లేదు. దక్షిణాదిలోనూ మన రాష్ట్రం లాస్ట్‌‌‌‌లో నిలిచింది. శనివారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తన వెబ్​సైట్​లో వ్యాక్సినేషన్ వివరాలను పొందుపరిచింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, యూటీలకు సంబంధించిన ఫస్ట్, సెకండ్ డోసుల డేటాను అప్‌‌‌‌డేట్ చేసింది. అందులో మన రాష్ట్రం 13వ స్థానంలో ఉంది.

3 కోట్లు కూడా దాటలే

దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. సౌతిండియాలో అతి తక్కువ వ్యాక్సినేషన్ నమోదైన రాష్ట్రం తెలంగాణే. కర్నాటక, తమిళనాడు, ఏపీ.. వరుసగా 7, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. కేరళ 11వ స్థానంలో ఉంది. ఇప్పటిదాకా కర్నాటక రెండు డోసులు కలిపి 6.05 కోట్లు, తమిళనాడు 5.26 కోట్లు, ఏపీ 4.63 కోట్లు, కేరళ 3.70 కోట్ల డోసులు వేశాయి. హర్యానాలో 2.45 కోట్ల డోసులు, పంజాబ్​లో 2.10 కోట్లు, చత్తీస్​గఢ్​లో 1.99 కోట్ల డోసుల టీకాలను జనానికి వేశారు. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో 2.99 కోట్ల మందికి మొదటి డోసు, 1.64 కోట్ల మందికి రెండో డోసు ఇచ్చారు. అంటే ఏపీ వేసినన్ని ఫస్ట్ డోసు టీకాలు కూడా మొత్తంగా మన రాష్ట్రంలో వేయలేదు. ఇప్పటిదాకా తెలంగాణలో 2 కోట్ల 5 లక్షల 10 వలే 470 మందికి ఫస్ట్ డోస్, 79 లక్షల 66 వేల 995 మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్​ వేసినట్లు కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం దాకా 24 గంటల వ్యవధిలో తెలంగాణలో 2,435 మందికి టీకా వేయగా.. రాజస్తాన్‌‌‌‌లో 1.6 లక్షలు, ఒడిశాలో 1.2 లక్షలు, ఉత్తర్​ప్రదేశ్​లో 82 వేలు, గుజరాత్​లో 70 వేలు, మహారాష్ట్రలో 40 వేల మందికి కరోనా వ్యాక్సిన్​ వేశారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్​లో కూడా 38 వేల మందికి టీకాలు వేశారు. 

దేశంలో వ్యాక్సినేషన్​ వంద కోట్ల డోసులకు దగ్గరైంది. శనివారం ఉదయం 7 గంటల వరకు ఫస్ట్, సెకండ్ డోసులు కలిపి 97,23,77,045 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో 69,30,14,131 మందికి ఫస్ట్ డోస్, 27,93,62,914 మందికి సెకండ్ డోస్ ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఫస్ట్, సెకండ్ డోసులు కలిపి 11.78 కోట్ల డోసులు వేసిన ఉత్తరప్రదేశ్‌‌.. దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 9.07 కోట్ల డోసులతో రెండో స్థానంలో, గుజరాత్ 6.64 కోట్ల డోసులతో మూడో స్థానంలో నిలిచాయి. తర్వాతి స్థానాల్లో మధ్య ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, కర్నాటక, రాజస్తాన్, తమిళనాడు, ఏపీ ఉన్నాయి.
 

Tagged Telangana, Vaccination, progressing slow

Latest Videos

Subscribe Now

More News