ప్రైవేట్​ ఆస్పత్రుల టీకా దందా

ప్రైవేట్​ ఆస్పత్రుల టీకా దందా
  • ఒక్కో డోసుకు రూ. 1,250 నుంచి 1,600
  • 5 రోజుల్లో రూ. 21 కోట్ల బిజినెస్.. 
  • సర్వీస్​ చార్జీలే రూ. 6.15 కోట్లు
  • దవాఖాన్లు, కాలనీలు, హోటళ్లలో వ్యాక్సిన్ డ్రైవ్‌లు
  • వేల మందికి ఒకే రోజు 
  • వ్యాక్సినేషన్ అంటూ ప్రకటనలు
  • ప్రైవేట్ బిజినెస్‌కు సర్కారు అండ
  • ప్రభుత్వ దవాఖాన్లలో మాత్రం
  • నెల రోజులుగా నో ఫస్ట్ డోస్

ప్రైవేటోళ్లకు ఎట్ల దొర్కవట్టె?
వ్యాక్సిన్ డోసులు లేవన్న సాకుతో ప్రభుత్వ సెంటర్లలో నెల రోజులుగా ఫస్ట్‌‌ డోసు వేయడం లేదు. కానీ, ప్రైవేటులో మాత్రం రెండు డోసులూ ఇస్తున్నారు. 18 ఏండ్లు దాటిన వాళ్లందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఒక్కో డోసుకు రూ.1,250 నుంచి 1,600 చార్జ్​  చేస్తున్నారు. రాష్ట్రంలో గడిచిన ఐదు రోజుల్లోనే ప్రైవేట్ హాస్పిటళ్లు 1.54 లక్షల మందికి వ్యాక్సిన్  వేశాయి. ప్రభుత్వానికి దొరకని వ్యాక్సిన్లు, ఇంత పెద్ద మొత్తంలో ప్రైవేట్ సంస్థలకు ఎట్ల దొరుకుతున్నాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. భారత్ బయోటెక్ కంపెనీ మన దగ్గరే ఉన్నా, ఆ సంస్థ దగ్గర్నుంచి వ్యాక్సిన్ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందంటున్నారు. ఆ సంస్థ సుమారు పది లక్షల డోసులను మన రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటళ్లకు సరఫరా చేసినట్టు హెల్త్ ఆఫీసర్లే  చెప్తున్నారు. కానీ, ప్రభుత్వానికి మాత్రం ఇప్పటివరకూ రెండున్నర లక్షల డోసులే సరఫరా అయ్యాయి. 

ఇష్టారీతిగా  సర్వీస్​ చార్జ్​లు
ఇప్పటికే కరోనా ఎఫెక్ట్​తో  కుదేలైన ప్రజలకు హాస్పిటల్ ఖర్చులతో పాటు వ్యాక్సినేషన్ భారంగా మారింది. ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్  దొరకకపోవడంతో ప్రైవేట్​ను ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 29  ప్రైవేటు హాస్పిటళ్లు వ్యాక్సినేషన్ నిర్వహించాయి. వీటిల్లో 42,573 మందికి వ్యాక్సిన్ వేశారు. ఒక్కో వ్యక్తి నుంచి సగటున రూ. 1,400 చొప్పున మొత్తంగా రూ.  5.96 కోట్ల బిజినెస్  చేశారు. గడిచిన ఐదు రోజుల్లో 1.54 లక్షల మందికి  ప్రైవేట్ సెంటర్లు వ్యాక్సిన్  వేశాయి. అంటే ఐదురోజుల్లో  దాదాపు రూ. 21.53 కోట్ల వ్యాపారం జరిగింది. ఇందులో టీకా డోసుల కోసం కంపెనీలకు  ఇచ్చేది పోను, సర్వీస్​ చార్జ్  కింద సగటున రూ. 400 చొప్పున రూ. 6.15 కోట్లు ప్రైవేట్​ సెంటర్లకు వచ్చాయి. ఒక్కో కార్పొరేట్​ హాస్పిటల్​ ఒక్కోరకంగా సర్వీస్​ చార్జీ​లు వసూలు చేస్తున్నాయి. రూ. 250 నుంచి 600 వరకు చార్జ్​ చేస్తున్నాయి. దీనిపై ఎలాంటి నియంత్రణ లేదు. 

రాష్ట్రంలో 18 ఏండ్లు నిండినవాళ్లు 2.64 కోట్ల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు డోసులంటే.. వీళ్లకు వ్యాక్సిన్ వేయడానికి 5.29 కోట్ల డోసులు కావాలి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 13 లక్షల మంది రెండు డోసులు వేసుకున్నారు. 39.71 లక్షల మందికి ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది. వీరికి సెకండ్ డోస్​తో పాటు మిగిలిన 2.11 కోట్ల మందికి రెండు డోసులు వ్యాక్సిన్ అవసరముంది. వీరందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయడానికి దాదాపు రూ. 2,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఎంతటి ఖర్చుకైనా వెనుకాడేది లేదని.. రూ. 2,500 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ, ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడుతుందనే కారణంతోనే వ్యాక్సినేషన్ విషయంలో సర్కారు వెనుకడుగు వేస్తున్నట్లు  తెలుస్తోంది. అందుకే  వ్యాక్సిన్ అవసరం ఉన్నవారిలో కనీసం 40 శాతం మందిని ప్రైవేటుకు మళ్లించాలని సర్కార్  నిర్ణయించింది. దీనికి తగ్గట్టు  వ్యాక్సినేషన్ స్ట్రాటజీలో మార్పులు చేస్తూ జనాలు  ప్రైవేటుకు వెళ్లేలా ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు. దీంతో అటు ప్రైవేటు హాస్పిటళ్లతో ఉన్న అండర్ స్టాండింగ్ బిజినెస్ వర్ధిల్లుతోందని, అంత మేరకు ప్రభుత్వంపై భారం తగ్గిపోతుందన్న అభిప్రాయాలున్నాయి. ఈ మళ్లింపు ద్వారా ప్రైవేట్ హాస్పిటళ్లలో సుమారు రూ. 2,350 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా. ఇందులో వ్యాక్సిన్  ఖర్చులు పక్కనపెట్టినా..  ప్రైవేటోళ్లకు రూ. 700 కోట్ల లాభం.

హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లూ కరోనా ట్రీట్‌‌మెంట్ పేరిట దోచుకున్న కార్పొరేట్ హాస్పిటళ్లు ఇప్పుడు టీకాల బిజినెస్ షురూ జేశాయి. వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం దాదాపుగా చేతులెత్తేయడంతో ప్రైవేట్ వ్యాక్సినేషన్‌‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కార్పొరేట్ హాస్పిటళ్లు ఏకంగా స్పెషల్ డ్రైవ్‌‌లు పెట్టి.. అధిక చార్జీలు వేసి రూ. కోట్లు సంపాదిస్తున్నాయి. ప్రైవేటు కంపెనీలు, ఆఫీసులు, కాలనీలు, సొసైటీలన్నింటా ఎక్కడపడితే అక్కడ వ్యాక్సిన్ వేస్తున్నామని, రిజిస్టర్ చేసుకొండంటూ వాట్సప్  మెసేజ్​లతో ప్రచారం హోరెత్తిస్తున్నాయి.  ‘‘ఒకే రోజు వేలాది మందికి వ్యాక్సిన్ వేస్తున్నాం.. బిగ్గెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్. తరలిరండి..’’ అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ దందాకు  ప్రభుత్వం పరోక్షంగా సహకారం అందిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ సెంటర్లలో ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ బంద్ పెట్టిందని, ఏ డోస్ అయినా, ఎవరికైనా వేసుకోండంటూ ప్రైవేటోళ్లకు పర్మిషన్  ఇచ్చేసిందనే చర్చ జరుగుతోంది.  

వేల మందితో స్పెషల్ డ్రైవ్​లు
రాష్ట్రంలో 90 ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇందులో ప్రస్తుతం అపోలో, యశోద, కాంటినెంటల్, మెడికవర్, కేర్ వంటి 30 కార్పొరేట్ సంస్థలు వ్యాక్సినేషన్‌‌  ప్రారంభించాయి. స్పెషల్ డ్రైవ్‌‌లు పెట్టి సగటున రోజూ 40 వేల మందికి వ్యాక్సిన్  వేస్తున్నాయి. అపోలో హాస్పిటల్ వాళ్లు శుక్రవారం హైదరాబాద్​లోని నోవాటెల్‌‌లో స్పెషల్ డ్రైవ్ పెట్టి ఒక్క రోజే 5 వేల మందికి వ్యాక్సిన్ వేశారు. సర్వీస్‌‌ చార్జ్​ కింద ఒక్కో వ్యక్తి వద్ద రూ.  250 చొప్పున, రూ. 12 లక్షల 50 వేలు లాభపడ్డారు. మెడికవర్ వాళ్లు ఒక్కరోజే  40 వేల మందికి వ్యాక్సిన్  వేయనున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌‌‌‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌లో ఆదివారం 40 వేల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్టు ఆ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీసులు సెక్యూరిటీ, ఇతర సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ 40 వేల మందికి కొవాగ్జిన్ వేయనున్నారు. ఒక్కో డోసు ఖరీదు రూ. 1,400. భారత్ బయోటెక్‌‌  కొవాగ్జిన్‌‌ ఒక్కో డోసుకు రూ.1,000  చొప్పున ప్రైవేట్ హాస్పిటళ్లకు అమ్ముతోంది. ఈ లెక్కన వ్యాక్సిన్‌‌  ధర రూ.1,000 తీసేస్తే, రూ. 400 సర్వీస్ చార్జ్‌‌ వేస్తున్నట్టు లెక్క. అంటే, ఒక్కో వ్యక్తికి నాలుగొందల చొప్పున ఒక్క రోజులోనే రూ. కోటి 60 లక్షలు ఈ సంస్థ సంపాదించనుంది. ఇలాంటి డ్రైవ్‌‌లు చేసేందుకు ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా సిద్ధమవుతున్నాయి. సర్వీస్​చార్జ్​ ఎంత అనేది ప్రభుత్వం నిర్ణయించకపోవడంతో హాస్పిటళ్లు ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయి.  

ధరల్లో వ్యత్యాసంతో ఇబ్బందులు
సీరమ్ ఇన్​స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్  డోసుల్లో 50 శాతం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోంది. ఇంకో 50 శాతం డోసుల్లో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు, 25 శాతం ప్రైవేట్ హాస్పిటళ్లకు అమ్ముకునేం దుకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కానీ, ఆ కంపెనీలు ప్రైవేట్ వాళ్లకు ఇవ్వడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాయి. ధరల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ఉదాహరణకు కొవాగ్జిన్  ప్రైవేటుకు రూ.1,000కు అమ్ముకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400కే ఇవ్వాలి. కొవిషీల్డ్‌‌ ప్రైవేట్ వాళ్లకు రూ. 600కు  ఇస్తే, ప్రభుత్వానికే రూ. 300కే ఇవ్వాలి. ఈ వ్యత్యాసం వల్ల  ప్రైవేటు వాళ్లకు అమ్మడానికే కంపెనీలు ఇంట్రస్ట్ చూపిస్తున్నాయి. ఆ కంపెనీలు ఎన్ని డోసులు ఉత్పత్తి చేస్తున్నాయి? ఎవరికి ఎన్ని డోసులు అమ్ముతున్నాయి? అనే వివరాలు  కేంద్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయి. ఆయా కంపెనీలు ఇచ్చినన్ని డోసులు తీసుకోవడమే తప్ప, రాష్ట్ర ప్రభుత్వాలకు మరో ఆప్షన్ లేదు. ప్రైవేట్‌‌కు పర్మిషన్‌‌  ఇవ్వకపోతే, వ్యాక్సినేషన్‌‌ స్లోగా అవుతుంది. మన దగ్గరే ఉన్న కంపెనీ ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు సంస్థలకు వ్యాక్సిన్ అమ్ముకుంటోంది. దీని వల్ల మనకు నష్టమే తప్ప లాభం లేదు.
- డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్‌‌‌‌, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌