
న్యూఢిల్లీ: భారత రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే దేశంలో మెరుపు వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్లను పరుగులు పెట్టించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో ప్రతిపాదిత ఢిల్లీ-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఢిల్లీ-అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ సర్వీస్ మొదలైతే.. ఢిల్లీ, అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం 14 గంటల నుంచి 3 నుంచి 4 గంటలకు గణనీయంగా తగ్గుతుంది.
ALSO READ | భారీ ప్రమాదం తప్పింది.. ఒకేసారి 900 అడుగుల కిందకు ఎయిర్ ఇండియా విమానం, ఏమైందంటే..?
ఢిల్లీ-అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ రాజస్థాన్‌కు కూడా గేమ్ ఛేంజర్‌గా మారనుంది. ఈ బుల్లెట్ రైలు రాజస్థాన్‌లోని ఏడు జిల్లాల గుండా మొత్తం 657 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఎంపిక చేసిన తొమ్మిది స్టేషన్లలో ఆగుతోంది. జైపూర్, అజ్మీర్, బెహ్రోర్, షాజహాన్‌పూర్, విజయనగర్, భిల్వారా, చిత్తోర్‌గఢ్, ఉదయపూర్, ఖేర్వాడ (దుంగర్‌పూర్ సమీపంలో) వంటి ప్రముఖ ప్రదేశాల్లో హాల్టింగ్ తీసుకుంటుంది. ఈ రైలు గంటకు 350 కి.మీ. వేగంతో ప్రయాణించగలదని అంచనా.
ఢిల్లీ-అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ అనేక సొరంగాలు, కొండ ప్రాంతాలు, వంతెనల గుండా ప్రయాణిస్తూ ప్రయాణికులకు కొత్త అనుభూతి అందించనుంది. ఈ రైల్ దేశంలోని ఐదు ప్రధాన నదులను దాటుతుంది. ఈ హై-స్పీడ్ రైలు రాజస్థాన్‌లోని ఏడు జిల్లాల్లోని 335 గ్రామాల గుండా దూసుకెళ్తోంది. ఇది ప్రయాణికులకు రాష్ట్ర వారసత్వం గురించి తెలుసుకునేందుకు దోహదపడుతోంది. జైపూర్, ఉదయపూర్ వంటి వారసత్వ సంపద కలిగిన పర్యాటక ప్రదేశాలను ఈ రైల్ ప్రయాణంలో భాగంగా ప్రయాణికులు చూడవచ్చు. ఈ బుల్లెట్ రైలు త్వరలోనే పట్టాలు ఎక్కనుంది.