ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత

 ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత

హైదరాబాద్: తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితులైన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాభి రామ్ గుండెపోటుతో కన్నుమూశారు. జూన్ 30న రాత్రి 9 గంటల 45 నిమిషాలకు ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేవలం వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాకుండా హిప్నటిజంలో కూడా ఆయన దిట్ట. మెజీషియన్గా కూడా సుపరిచితులు. మోటివేషనల్ స్పీకర్గా ప్రసంగాలు మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలనే అంశంపై ఆయన పలు పుస్తకాలు కూడా రాశారు.

వేల మందిని.. మరీ ముఖ్యంగా విద్యార్థులను తన ప్రసంగాలతో, పుస్తకాలతో మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు పట్టాభి రామ్ కృషి చేశారు. దాదాపు 20 సంవత్సరాలకు పైగా మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా గౌరవప్రదంగా కొనసాగారు. ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఖైరతాబాద్ లోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. జులై 2న మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. వ్యక్తిత్వ వికాస రంగంలో ఆయన సేవలకు గానూ ఎన్నో అవార్డులు, రివార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.

ఆయన రాసిన పుస్తకాల్లో.. ‘కష్టపడి చదవొద్దు.. ఇష్టపడి చదవండి’, ‘జీనియస్‌ మీరు కూడా’, ‘విజయం మీదే’ మొదలైన రచనలకు పాఠకుల నుంచి విశేష ఆదరణ దక్కింది. బి.వి.పట్టాభిరాం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి పట్టా పొందారు. ఫిలాసఫీ, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో స్నాతకోత్తర పట్టా అందుకున్నారు. కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్, జర్నలిజంలో పీజీ డిప్లమా పూర్తి చేశారు.

మానసిక శాస్త్రం, ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సెలింగ్, హిప్నోథెరపీలలో అమెరికా నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. హిప్నోసిస్పై పట్టాభి రామ్ చేసిన కృషికి గానూ1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఈయనకు డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది. ‘ప్రశాంతి కౌన్సిలింగ్ అండ్ హెచ్.ఆర్.డి సెంటర్’ పేరుతో ఆయన ఎంతోమందిలో మానసిక స్థైర్యాన్ని నింపారు.