
తిరుమల: ఈ నెల 6, 7 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని సుందరంగా అలంకరించారు టీటీడీ అధికారులు. వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వైకుంఠ ద్వారం గుండా భక్తులకు సాధారణంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే కల్పిస్తారు. అయితే ఈ దర్శనం కోసం ఎక్కువ సంఖ్యలో భక్తులు తపిస్తుంటారు. కానీ, ఈ రెండ్రోజుల్లో భారీ రద్దీ కారణంగా దర్శనం చేసుకోలేక కొంతమంది వెనుదిరుగుతుంటారు. మరికొందరు వెళ్లాలని ఉన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆగిపోతారు.
సమావేశానికి రమణ దీక్షితులు గైర్హాజరు
‘వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని కోరుకునే భక్తులకు మరింత ఎక్కువ సంఖ్యలో అవకాశం కల్పించాలి. ఈ దర్శనం ద్వారా ముక్తి లభిస్తుంది. అందుకే తిరుమలలో వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరిచేలా టీటీడీని ఆదేశించండి’ అని కోరుతూ ఓ వ్యక్తి ఏపీ హైకోర్టులో శుక్రవారం పిల్ వేశాడు. దీనిపై టీటీడీ నిర్ణయం చెప్పాలని హైకోర్టు ఆదేశించడంతో ఆదివారం తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ బోర్డు అత్యవరసరంగా సమావేశమైంది. అయితే ప్రస్తుతానికి రెండ్రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని భావిస్తున్న టీటీడీ పాలకమండలి దీనిపై ఆగమ సలహా మండలి అభిప్రాయాన్ని కోరింది.
ఈ బేటీకి టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు, కీలక అధికారులు, నలుగురు ఆగమ సలహా మండలి సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఆగమ సలహామండలి సభ్యుడు రమణదీక్షితులు మాత్రం సమావేశానికి వెళ్లలేదు. ఇప్పటికే 10 రోజులు వైకుంఠ ద్వారాలు తెరిచేందుకు రమణదీక్షితులు తప్ప మిగిలిన నలుగురు సభ్యులు ఆమోదం తెలిపారు. కానీ, నేటి సమావేశానికి ఆయనే గైర్హాజరు కావడంతో టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.