వైభవంగా వైకుంఠ ఏకాదశి..యాదాద్రి, భద్రాద్రి, ధర్మపురి ఆలయాలకు పోటెత్తిన భక్తులు

వైభవంగా వైకుంఠ ఏకాదశి..యాదాద్రి, భద్రాద్రి, ధర్మపురి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
  • ఉత్తర ద్వారం నుంచి స్వామివార్ల దర్శనాలు
  •     యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్న మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు

యాదగిరిగుట్ట/ భద్రాచలం/ ధర్మపురి, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివార్లను ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకు భక్తులు యాదగిరిగుట్ట, భద్రాచలం, ధర్మపురి క్షేత్రాలకు పోటెత్తారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంతో పాటు పాతగుట్ట క్షేత్రంలో మంగళవారం స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 5:30 గంటలకు యాదగిరీశుడిని లక్ష్మీ నరసింహస్వామి అలంకారంలో గరుడ వాహనంపై ఉత్తర రాజగోపుర ద్వారం గుండా బయటకు తీసుకువచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. 

ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక వేదికపై స్వామివారిని అధిష్టింపజేసి ఉదయం 7:30 గంటల వరకు దర్శనం కల్పించారు. అనంతరం తిరువీధి సేవ చేపట్టారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ప్రముఖులు గుట్టకు తరలివచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 

అనంతరం ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, స్టేట్ విమెన్స్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ బి. సత్యప్రసాద్ దంపతులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. అనంతరం కలెక్టర్ సత్య ప్రసాద్ దంపతులు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

భద్రాచలంలో దర్శనమిచ్చిన సీతారామచంద్రులు..

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రులవారిని భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. ఉదయం 5 గంటలకు ధూపదీపాలు, వేదమంత్రోచ్ఛారణలు మధ్య వైకుంఠ ఉత్తరద్వారాలు తెరుచుకు న్నాయి. ఆ తర్వాత గంట సేపు స్వామికి శ్రీరామా తారక నామ అష్టోత్తర పూజలు నిర్వహించి, వేదాలను పఠించారు. ఏకాదశి పూట ఉత్తర ద్వార విశిష్టతను వేదపండితులు వివరించారు. 

ఉత్తర ద్వార దర్శనం తర్వాత వైకుంఠ రాముడు తిరువీధి సేవకు తరలి వెళ్లారు. చలువ చప్పర వాహనంపై పెరియాళ్వార్‍, నమ్మాళ్వార్‍, మరో వాహనంపై ఆండాళ్లమ్మ వారు, హనుమద్‍వాహనంపై లక్ష్మణస్వామి, గజ వాహనంపై సీతమ్మవారు, గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తికి తిరువీధి సేవ జరిగింది. ముందుగా అర్ధరాత్రి 12 గంటలకు గర్భగుడిలో శ్రీ సీతారామచంద్రస్వామి మూలవరులకు తొలి అభిషేకం భక్తరామదాసు పేరిట స్థానిక తహశీల్దారు ధనియాల వెంకటేశ్వర్లు నిర్వహించారు. భక్తరామదాసు తహశీల్దారుగా ఉన్న కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 

ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్​పత్​ ఉత్సవాలు ముగిసి రాపత్​ సేవలు షురూ అయ్యాయి. రాపత్​ సేవలో భాగంగా మంగళవారం సాయంత్రం ఏఎస్పీ విక్రాంత్​ కుమార్​ సింగ్​వైకుంఠ రాముడిని తమ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.