- అవతారంలో ఉత్తర ద్వార దర్శనం
- ఉదయం 5:30 నుంచి 6:30 గంటల వరకు
- వైకుంఠ ద్వారదర్శనమిచ్చిన నారసింహుడు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వార దర్శించుకున్నారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చిన స్వామివారు భక్తులను కనువిందు చేశారు. వైకుంఠ ఏకాదశి కావడంతో.. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
స్థానిక భక్తులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో.. ఉత్తర రాజగోపుర ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనులతో యాదగిరిగుట్ట ‘ఇల వైకుంఠం’ గా మారింది. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు.. స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న అనంతరం.. ఉత్తర రాజగోపురం గుండా ఆలయంలోకి వెళ్లి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని తరించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నారసింహుడి క్షేత్రంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి. సద్గురు అన్నమాచార్య సంకీర్తన అభినాలయ కళాకారులు చేసిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన, కోలాటం, వీణా సమ్మేళనం భక్తులను తన్మయత్వంలో ముంచెత్తాయి.
సాయంత్రం హైదరాబాద్ కు చెందిన జేవీ సిరి ఆర్ట్స్ ఇనిస్టిట్యూట్ సర్వింగ్ ది ఫిట్ ఆఫ్ లార్డ్ నటరాజ్ క్లాసికల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ బృందం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తజనులను మంత్రముగ్ధులను చేసింది. ఇదిలా ఉండగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ నాగోల్ కు చెందిన సుప్రజా హాస్పిటల్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. పలువురు భక్తులు, ఆలయ సిబ్బందికి వైద్య సిబ్బంది ఉచితంగా పలు రకాల పరీక్షలు చేసి అవసరమైన టాబ్లెట్లను అందజేశారు.
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు వివిధ ఆలయాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వారం ద్వారా దర్శనమిస్తున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు.
