- నారసింహుడి ఉత్తర ద్వార దర్శనం
- ఉ.5:30 నుంచి 6:30 గంటల వరకు వైకుంఠ నాథుడి
- ఉత్తర ద్వార దర్శనం
యాదగిరిగుట్ట, వెలుగు: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ముస్తాబైంది. మంగళవారం స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వడానికి ఆలయ ఆఫీసర్లు సర్వం సిద్ధం చేశారు. మంగళవారం ఉదయం 5:30 నుంచి 6:30 గంటల వరకు.. గంట పాటు స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్నారు.
ప్రధానాలయ ఉత్తర రాజగోపురం నుంచి స్వామివారు వెలుపలకు వచ్చి ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక వేదికపై నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆలయ ఆఫీసర్లు ఏర్పాట్లు కంప్లీట్ చేశారు. ఉత్తర రాజగోపురం ఎదుట స్పెషల్ బారికేడ్లు, గ్రిల్స్ ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో ప్రధానాలయం, ఆలయ మాడవీధులు, ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు.
పలువురు మంత్రులు, వీఐపీలు, ఉన్నతాధికారులు రానున్న నేపథ్యంలో.. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతదూరం నుంచైనా ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టారు. సాధారణ భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా వీఐపీల కోసం సపరేట్ క్యూలైన్లను ఏర్పాటు చేశారు. దూరంగా ఉన్న భక్తులకు స్వామివారు స్పష్టంగా కనిపించేలా మూడు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులతో ప్రత్యేక బందోబస్తుకు చర్యలు చేపట్టారు. దాదాపుగా 200 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎంతమంది వచ్చినా సరిపోయేలా ప్రసాదాలను తయారు చేసి అందుబాటులో ఉంచారు. ఉదయం 5:30 నుంచి 6:30 గంటల వరకు స్వామివారు ఉత్తర ద్వారదర్శనం ఇచ్చిన అనంతరం.. స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించనున్నారు.
అనంతరం ఉదయం 6:30 గంటల నుంచి ఉదయం 7:40 గంటల వరకు స్వామివారి తిరువీధి సేవ నిర్వహించనున్నారు. ఇక 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా బ్రేక్ దర్శనాలతో పాటు ఆలయంలో నిత్యం నిర్వహించే స్వామివారి నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, లక్షపుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన కైంకర్యాలను ఒక్కరోజు రద్దు చేశారు.
రెండు రోజులు ఉత్తర ద్వారం గుండా దర్శనాలు
భక్తుల సౌకర్యార్థం ఈ నెల 30, 31న రెండు రోజులు ఉత్తర ద్వారం గుండా ప్రవేశం కల్పించి స్వామివారిని దర్శించుకునేలా ఆలయ అధికారులు అవకాశం కల్పించారు. వైకుంఠ ద్వారం(ఉత్తర ద్వారం) గుండా స్వామివారిని దర్శించుకోవాలనే భక్తులు కోరిక మేరకు.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి రెండు రోజుల పాటు ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకునేలా అవకాశం కల్పించారు. ఈ నెల 30, 31న రోజుల్లో ఉదయం నుంచి రాత్రి గుడి మూసివేసే వరకు భక్తులకు ఉత్తర ద్వార ప్రవేశ దర్శనాలు ఉండనున్నాయి.
నేటి నుండి అధ్యయనోత్సవాలు షురూ
యాదగిరిగుట్టలో మంగళవారం ఉదయం వైకుంఠ ఏకాదశి సంబరాలు ముగియగానే.. సాయంత్రం మరో వేడుకకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. ఆలయంలో ఈ నెల 30 నుంచి జనవరి 4 వరకు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలు తాత్కాలికంగా రద్దు చేశారు. ఆరు రోజుల పాటు అలయంలో నిత్యం నిర్వహించే సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, జోడు సేవలు తాత్కాలికంగా రద్దు చేశారు.
అధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పలు అవతారాల్లో స్వామివారి అలంకార సేవలు నిర్వహించనున్నారు. 30న ఉదయం లక్ష్మీనరసింహస్వామి అలంకారం,సాయంత్రం మత్స్యాలంకారం.. 31న వేణుగోపాల కృష్ణాలంకారం, గోవర్ధనగిరిధారి అలంకారం.. జనవరి 1న రామావతారం, వెంకటేశ్వరస్వామి అలంకారం.. 2న వెన్నకృష్ణుడి అలంకారం, కాళీయమర్ధనుడి అలంకారం.. 3న వటపత్రశాయి అలంకారం, వైకుంఠనాథుడి అలంకారం.. 4న ఉదయం నిర్వహించే శ్రీలక్ష్మీనరసింహస్వామి అలంకార సేవతో అధ్యయనోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.
