- యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో వెంకటరావు
- వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఆలయ ఆఫీసర్లతో సమీక్ష
యాదగిరిగుట్ట, వెలుగు: ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా.. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు లక్ష్మీనరసింహస్వామి ‘ఉత్తర ద్వార దర్శనం’ కల్పించనున్నట్లు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో వెంకటరావు తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేయాల్సిందిగా ఆలయ అధికారులను ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, నిర్వహణపై ఆదివారం యాదగిరి కొండపైన ఈవో కార్యాలయంలో ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే భక్తులకు స్వామివారి ‘ఉత్తర ద్వార దర్శనం’ సదుపాయం ఉండేదన్నారు. కానీ ఈ సారి ప్రతి భక్తుడు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో.. ఉదయం నుంచి రాత్రి వరకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో.. ఉత్తర రాజగోపుర ద్వారాన్ని పూలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించాలని, ప్రధానాలయం మొత్తం దేదీప్యమానంగా వెలుగొందేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భక్తుల సౌకర్యార్థం.. సాధారణ భక్తులు, దాతలు, వీఐపీలు, స్థానికులు, మీడియా కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు ఉచితంగా పొంగలి ప్రసాదం పంపిణీ చేయాలని, రెండు వేల మందికి అన్నప్రసాద వితరణ చేయాలన్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో.. ట్రాఫిక్ సమస్యలు, భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక పోలీసులు, ఎస్పీఎఫ్, హోంగార్డులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎస్పీఎఫ్ సీఎస్ఓ శేషగిరిరావుకు ఆదేశాలు జారీ చేశారు. ఆధ్యాత్మికత వాతావరణంలో ఫ్యామిలీతో కలిసి భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఈఈ దయాకర్ రెడ్డి, ఏఈవోలు గజవెల్లి రఘు, శంకర్ నాయక్, కృష్ణ గౌడ్, నవీన్, మహేష్, ఎస్పీఎఫ్ సీఎస్ఓ శేషగిరిరావు, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, సూపరింటెండెంట్ రాజన్ బాబు, సురేందర్ రెడ్డి, వెంకటేశ్, నరేష్, శ్రీలత, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
