ఫార్మా నిర్వాసితులకు విలువైన ప్లాట్లు.. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి

ఫార్మా నిర్వాసితులకు విలువైన ప్లాట్లు.. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి

లేఅవుట్​ నుంచి రేడియల్​ రోడ్డు
    రంగారెడ్డి కలెక్టర్​ నారాయణరెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: పారదర్శకంగా, వంద శాతం హక్కులతో ఫార్మా భూనిర్వాసిత  రైతులకు ప్రభుత్వం ప్లాట్లు అందజేస్తోందని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి చెప్పారు. సోమవారం (జులై 08) రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేట్ లో ఏర్పాటు చేసిన లేఅవుట్​లో యాచారం, కందుకూరు మండలాల పరిధిలోని 7 గ్రామాల రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని సదుపాయాలతో లేఅవుట్​ రూపొందించి రైతులకు ప్లాట్లు అందిస్తున్నామని, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా  ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఈ లేఅవుట్ నుంచి భవిష్యత్తులో రేడియల్ రోడ్డు వస్తోందని, ఈ ప్లాట్లకు భవిష్యత్తులో ఫుల్​ డిమాండ్​ ఉంటుందని చెప్పారు. ఎవరూ ప్లాట్లను అమ్ముకోవద్దని సూచించారు. 

మొదటి రోజు 670 మంది రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ ఎండీ కె.శశాంక్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, డీసీపీ సునితారెడ్డి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, ఆర్డీవోలు జగదీశ్వర్​ రెడ్డి, అనంతరెడ్డి, డీపీవో సురేశ్  మోహన్  తదితరులు  పాల్గొన్నారు.