
అమరావతి: నెల్లూరు జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో వేంరెడ్డి వర్సెస్ నల్లపురెడ్డిగా పాలిటిక్స్ మారాయి. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. టీడీపీ మహిళ నేతలు ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డిని కోవూరు నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వమని టీడీపీ శ్రేణులు హెచ్చరించగా.. తమను ఎవరూ ఆపుతారో చూస్తామంటూ వైసీపీ నేతలు అంటుండటంతో నెల్లూరు జిల్లా పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి.
అసలేం జరిగిందంటే..?
కోవురూ ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతిరెడ్డి వల్ల ఆమె భర్త ప్రభాకర్ రెడ్డికి ప్రాణహాని ఉందని, ఆయన నిద్రలోనే చనిపోతాడని లేదా ఎక్కడో ఒకచోట లేపేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రెడ్డి ఒక పిచ్చోడని.. ఆయనను బ్లాక్ మెయిల్ చేసి ప్రశాంతి పెళ్లి చేసుకుందని హాట్ కామెంట్స్ చేశారు. ‘‘ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెబుతున్నా.. నీ దగ్గర రూ. వేల కోట్ల ఆస్తులున్నాయ్.. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే నిన్ను చంపడానికి రెండు సిట్టింగ్లు అయ్యాయని నా దగ్గర సమాచారం ఉంది" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రెడ్డి ఎవరూ దొరకనట్టు ఆమెను పెళ్లి చేసుకున్నారని.. ఆయన కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడినంటూ ప్రసన్నకుమార్ చేసిన కామెంట్స్ వివాదానికి ఆజ్యం పోశాయి.
తీవ్రంగా ఖండించిన మహిళా లోకం:
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను మహిళలు తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు జిల్లా కోవూరులో ఆందోళనలు ఉధృతమయ్యాయి. వేలాది మంది మహిళలు రోడ్డెక్కి ప్రసన్నకుమార్ రెడ్డిని నియోజకవర్గంలో అడుగు పెట్టనీయమని ధ్వజమెత్తారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఒక మహిళా ఎమ్మెల్యేపై ఇలా అసభ్యకరంగా మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. టీడీపీ మహిళా నేతలు కోవూరు పీఎస్‌లో ప్రసన్నకుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ప్రశాంతిరెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గానికి రావాలని నినాదాలు చేశారు.
ప్రశాంతిరెడ్డి, ఇతర నేతల స్పందన:
ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నల్లపురెడ్డి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదని, దాడుల సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు. ప్రసన్నకుమార్ వల్ల చాలా మంది బాధపడ్డారని, వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండొచ్చని అన్నారు. వైసీపీ నేతలకు తనదొకటే ప్రశ్న అని, నల్లపురెడ్డి తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మీ ఇంట్లో మహిళలకు చూపించండని అన్నారు. నల్లపురెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
►ALSO READ | శ్రీశైలం గేట్లు ఓపెన్.. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు తెరిచిన సీఎం చంద్రబాబు
టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడటం జిల్లాలో ఎప్పుడూ లేని సంస్కృతికి తెరలేపడమేనని అన్నారు. ప్రశాంతిరెడ్డి నల్లపురెడ్డికి చెల్లెలు వరుస అవుతుందని గుర్తుచేశారు. అలజడి, అశాంతి సృష్టించేందుకే ప్రసన్న ఇలా మాట్లాడారని, రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
గతంలో చంద్రబాబు, పవన్‍పైనా ఇలాగే మాట్లాడారని, అందుకే ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ.. ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని, ప్రసన్నకుమార్ రెడ్డి మాటలు సభ్యసమాజాన్ని సిగ్గుపడేలా చేస్తున్నాయని పేర్కొన్నారు.