వారెవ్వా వందే భారత్ ఎక్స్ప్రెస్..ఫీచర్లు చూస్తే అదుర్స్

వారెవ్వా వందే భారత్ ఎక్స్ప్రెస్..ఫీచర్లు చూస్తే అదుర్స్

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులను పలుకరించేందుకు వందే భారత్ రైలు వస్తోంది. ఈ నెల 19 నుంచి తెలంగాణ, ఏపీ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది. 8వ వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. మరి వందే భారత్ రైలు ప్రయాణం..అందులోని ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.

రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రయ్ మంటూ దూసుకెళ్లబోతుంది.  ఈ నెల 19 నుంచి సికింద్రాబాద్ నుంచి ఏపీ విశాఖపట్నం వరకు వందే భారత్ ప్రయాణం చేయనుంది.  ప్రధాని మోడీ వందే భారత్ రైలును లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో దేశంలో 8వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్లబోతుంది. దేశంలో ఇప్పటి వరకు ఏడు వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. న్యూ ఢిల్లీ -వారణాసి, న్యూ ఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, న్యూ ఢిల్లీ-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్-  గాంధీ నగర్‌, మైసూర్  -చెన్నై, నాగ్‌పూర్  -బిలాస్‌పూర్, హౌరా- న్యూజల్‌పాయ్‌గురి రూట్లల్లో వందే భారత్ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. 

ప్రయాణ సమయం ఆదా

వందే భారత్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. 1128 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.  0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 52 సెకండ్లలో అందుకుంటుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్  సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం ప్రయాణిస్తుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గిపోతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వైజాగ్ ప్రయాణ సమయం 14 గంటలు అవుతుండగా..వందే భారత్లో ప్రయాణిస్తే..8 గంటల్లో చేరుకోవచ్చు. 

ఫీచర్లు ఏంటంటే..

వందే భారత్ ఎక్స్ ప్రెస్లో  ఆటోమెటిక్ డోర్ సిస్టమ్ ఉంటుంది.  ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే  వందే భారత్లో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ రైళ్లలో వైఫై, హాట్ స్పాట్  కూడా ఉంటుంది.  వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో GPS బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఏర్పాటు చేశారు. దీనికి తోడు  బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్,  దివ్యాంగులకు అనుకూలంగా వాష్ రూమ్స్ ఏర్పాటు చేశారు.  సీట్ హ్యాండిల్‌కు, సీట్ నెంబర్స్‌కు బ్రెయిలీ లెటర్స్ ఉంటాయి.  వేడివేడి కాఫీ, భోజనం, కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. ప్రతి కోచ్కు ప్యాంట్రీ సదుపాయాన్ని కూడా కల్పించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో  సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. ఎగ్జిక్యూటీవ్ క్లాస్ బోగీల్లో రొటేటింగ్ చైర్లు ఆకట్టుకుంటాయి. 

వందే భారత్ ఈ స్టేషన్లలో ఆగనుంది

సికింద్రాబాద్లో మొదలయ్యే వందే భారత్ ఎక్స్ ప్రెస్..వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్ లలో ఆగుతుంది.  చివరకు వైజాగ్ చేరుకుంటుంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లల్లో చైర్ కార్ సీటింగ్ వ్యవస్థ మాత్రమే ఉంది. త్వరలో వందే భారత్ రైళ్లల్లో స్లీపర్ బెర్తులు అందుబాటులోకి రానున్నాయి. అయితే 500 కి.మీ నుంచి 600 కి.మీ దూరం మధ్య ప్రయాణించే  వందే భారత్ రైళ్లల్లో స్లీపర్ బెర్తులు అందుబాటులోకి వస్తాయి.