లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధ

లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధ

ఏపీ రాజకీయాల్లో బెజవాడ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. అన్నమయ్య జిల్లా.. పీలేరులో జరుగుతున్న లోకేష్ పాదయాత్రలో..(LokeshPadayatra) వంగవీటి రాధా (VangavetiRadha) పాల్గొన్నారు. యువనేతతో కలిసి యువగళం పాదయాత్రలో.. నాలుగు కిలోమీటర్లు నడిచారు రాధా. ఈ పరిణామంతో.. బెజవాడ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. రాధా ఇంతకీ ఏ పార్టీలోకి వెళుతున్నారు.. ఎందుకీ గందరగోళం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం.. కొన్నాళ్లు రాధా జనసేన పార్టీలోకి వెళుతున్నట్లు వార్తలు రావటమే. అయితే అనూహ్యంగా లోకేష్ పాదయాత్రలో పాల్గొనటం ఆసక్తి రేపుతోంది.

ప్రస్తుతానికి వంగవీటి రాధా టీడీపీలోనే (TDP) ఉన్నారు. 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో వైసీపీ (YCP) నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. అప్పటికే టికెట్లు కన్ఫామ్ కావటంతో.. ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకున్నారు చంద్రబాబు. టీడీపీ ఓడిపోవటంతో పార్టీలోనే సైలెంట్ అయ్యారు రాధా. కొన్ని నెలలుగా జనసేన పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. పవన్ కల్యాణ్ తో చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీలో చేరి.. బందరు నుంచి పార్లమెంట్ కు పోటీ చేయించేలా పవన్ కల్యాణ్ వ్యూహం రచించారని.. ఎంపీకి కాకపోతే జనసేన (JanaSena) నుంచే ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది.

జనసేన పార్టీలోకి వెళుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలోనే.. పీలేరులో సాగుతున్న లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా ప్రత్యక్షం కావటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఇక్కడ ఓ ఈక్వేషన్ కొత్తగా తెరపైకి వస్తుంది. టీడీపీ – జనసేన కలిసే పోటీ చేస్తున్నాయి కాబట్టి.. అందులో భాగంగా లోకేష్ కు మద్దతు తెలపటానికే రాధా వచ్చారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. పాదయాత్రలో రాధా పాల్గొనటంతో.. ఫ్లెక్సీల్లో లోకేష్ తోపాటు.. పవన్ కల్యాణ్ ఫొటోలు, రాధా ఫొటోలు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వటం విశేషం.. వాళ్లు వీళ్లు.. వీళ్లు వాళ్లే.. అంతా ఒక్కటే.. రెండు పార్టీలు ఒక్కటే.. రెండు పార్టీల నేతలది ఒక్కటే అన్న తీరుగా.. కార్యకర్తలకు సంకేతం పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..