వరలక్ష్మీ దేవిని ఏ పూలతో పూజించాలి.. నైవేద్యం పెట్టే పిండివంటలు ఇవే..

వరలక్ష్మీ దేవిని ఏ పూలతో పూజించాలి.. నైవేద్యం పెట్టే పిండివంటలు ఇవే..

శ్రావణ మాసం మొదలైంది. స్త్రీలు ఈ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ అమ్మవారికి పూజలు చేస్తారు. నోములు, వ్రతాలు ఆచరిస్తారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. వరలక్ష్మీదేవి అంటే వరాలు ఇచ్చే దేవి. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణ మాసంలో ఆచరించే వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరం. శుభకరం. ఆడవారు సుమంగళిగా ఉండేందుకు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతం రోజు ( ఆగస్టు 25)  అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి? అమ్మవారికి నైవేద్యంగా ఏమి పెట్టాలో తెలుసుకుందాం.

వరలక్ష్మీ వ్రతం రోజు మహిళలు అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తారు. వేకువ ఝామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని అమ్మవారిని అలంకరించి, పిండి వంటలతో నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. అయితే ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పువ్వులతో  గులాబీ, మందార, చేమంతి, జాజి పూలు వంటి వాటితో  పూజ చేసి.. ఇష్టమైన ద్రవాలు, పిండి వంటలతో నైవేద్యం పెడతారు. వరలక్ష్మీ అమ్మవారికి గోక్షీరం.. అంటే ఆవు పాలు ఎంతో ఇష్టం. ఆవునెయ్యి కూడా అమ్మవారికి ప్రీతి. అమ్మవారికి పాయసం అంటే చాలా ఇష్టం. పాలలో ఉడికిన అన్నంతో పాయసం చేసి నైవేద్యం పెట్టాలి. దద్దోజనం, పులిహార, బూరెలు  ఇలా వీలైనన్ని పిండివంటలు నైవేద్యం పెట్టవచ్చును.

అమ్మవారికి నారికేళం అంటే కొబ్బరికాయ కూడా ఇష్టం. అమ్మవారికి ఇష్టమైన పత్రం మారేడు పత్రం. ఇష్టమైన జంతువు ఏనుగు. అందుకే అమ్మవారికి పూజకు చేసే డెకరేషన్లలో ఏనుగు బొమ్మలను రెండువైపులా పెడుతుంటారు. వీటన్నంటితో పాటు అమ్మవారికి ఇష్టమైన స్వరూపంగా తయారై స్త్రీలు వ్రతం ఆచరించాలి. తలలో పువ్వులు పెట్టుకుని.. కాళ్లకు పసుపు, కళ్లకు కాటుక, చేతికి గాజులు, మెడలో మంగళసూత్రం, కాలికి మెట్టెలు, నుదుటన కుంకుమ ధరించాలి. భర్త చేయించిన బంగారు వస్తువును మొదట అమ్మవారికి పూజలో అలంకరించి ఆ తరువాత స్త్రీలు ధరించాలి.