నాలాల కబ్జాతో కొద్దిపాటి వానకే ఆగమైతున్నవరంగల్

నాలాల కబ్జాతో కొద్దిపాటి వానకే ఆగమైతున్నవరంగల్

వరంగల్, వెలుగు: కొద్దిపాటి వాన పడ్డా వరంగల్​సిటీ వణికిపోతోంది. వరద, మురుగు నీరు ప్రవహించే నాలాలు కబ్జాలకు గురికావడం.. డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేకపోవడంతో రోడ్లన్నీ కెనాళ్లను తలపిస్తున్నాయి. నాలాల్లో పూడిక పెరిగిపోవడం వల్ల వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి చిరుజల్లులు కురిసినా కాల్వలన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఇటు జీడబ్ల్యూఎంసీ గానీ, అటు కుడా గానీ కాల్వల విస్తరణ, పొడిగింపుపై దృష్టి పెట్టకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల కురిసిన భారీ వర్షాలకు వరంగల్​లోని దాదాపు 100 కాలనీలు నీట మునిగాయి. దీన్ని బట్టి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నాలాలు ఉప్పొంగడం, కాలనీలన్నీ నీళ్లతో నిండిపోవడంతో విజయవాడ నుంచి ఎన్డీఆర్ఎఫ్​ టీంలు, హెచ్​ఎండీఏ నుంచి డీఆర్ఎఫ్​ టీంలను రప్పించి సహాయ చర్యలు చేపట్టాల్సి వచ్చింది.

ఆక్రమణల పాపమే..

ట్రై సిటీస్​గా పేరున్న వరంగల్​, హన్మకొండ, కాజీపేటలో వరద, మురుగునీరు ప్రవాహానికి ప్రధానమైన హన్మకొండ నయీంనగర్​ నాలా, హంటర్ రోడ్డు బొందివాగు, కరీమాబాద్​ శాకరాసికుంట, వరంగల్​ భద్రకాళి నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. పెద్దపెద్ద లీడర్లు నాలాలపైనే కట్టిన బిల్డింగులు, ఇతర కట్టడాలు అన్నీ కలిసి 415 వరకు కబ్జాలు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. వరంగల్​ ముంపునకు గురైన సమయంలో  మంత్రి కేటీఆర్, బీజేపీ స్టేట్  చీఫ్​ బండి సంజయ్, ఇతర పార్టీల నాయకులు సందర్శించి సిటీ మునగడానికి ఆక్రమణలే కారణమని స్పష్టం చేశారు. దీంతో ఆఫీసర్లు దిద్దుబాటు చర్యలు చేపట్టి వాటిని తొలగించే పనిలో పడ్డారు. వీటితోపాటు సిటీ వేగంగా డెవలప్​ అవుతుండటంతో అదే తీరుగా చుట్టుపక్కలా కొత్త కాలనీలు కూడా వెలుస్తున్నాయి. చాలా వరకు ఎఫ్​టీఎల్  రూల్స్​ పాటించకుండా చెరువులను ఆక్రమించి వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటివల్ల కూడా ముంపు సమస్య ఏర్పడుతోంది. వరంగల్​ సిటీకి చుట్టుపక్కల కాకతీయులు నిర్మించిన దాదాపు 52  గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురికావడం వల్ల వర్షాలు పడినప్పుడు ఒకదాని నుంచి ఒకదాంట్లోకి నీళ్లు వెళ్లే లింక్​లు తెగిపోతున్నాయి. దీంతో వరద నీరు కాలనీల్లో ప్రవహిస్తోంది.

కాల్వల్లా మారుతున్న కాలనీలు

వరంగల్​లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా వరద నీటికి కాలనీలు, స్లమ్​ ఏరియాలు నీటమునుగుతున్నాయి.  లోతట్టు కాలనీల్లో డ్రైన్లు, కల్వర్టులు కట్టడానికి ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెడతామన్నారు. కానీ అది అమలు కాలేదు. దీంతో గత నెలలో కురిసిన వర్షాలకు సిటీలోని వందకు పైగా కాలనీలు నీటమునిగాయి. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో దాదాపు 20 షెల్టర్లను  ఏర్పాటు చేసి 6 వేల మందికి ఆశ్రయం కల్పించారు. 2016లోనూ పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తడంతో అప్పటికప్పుడు ఆఫీసర్లు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.  తర్వాత ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు.