పరాటా ... పేరు వినగానే తినాలనిపిస్తుంది. ఆ పరాటాలను వేడి వేడిగా వెరైటీగా ఇంట్లోనే చేసుకుంటే భలే బాగుంటుంది. కదా. అందుకే మీ కోసం వెరైటీ పరాటాలను ఎలా తయారు చేయాలో చూద్దాం. . . !
చీజ్ పరాట తయారీకి కావలసినవి
- చీజ్ తురుము: 1 1/2 కప్పు
- ఉల్లిగడతరుగు: 1/2కప్పు
- కొత్తిమీర తరుగు :1/4 కప్పు
- పచ్చిమిర్చి తరుగు :2టీస్పూన్లు
- ఉప్పు: తగినంత
- గోధుమ పిండి:1కప్పు
- నూనె లేదా బటర్ :3టీస్పూన్లు
- గరంమసాల: 1/2 టీస్పూన్
- చాట్ మసాలా: 1/2 స్పూన్
- కారం :1/2 టీస్పూన్
- పసుపు :చిటికెడు
తయారీ విధానం : ఒక గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, 1 స్పూన్ నూనె, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతి పిండిలా కలపాలి. పావుగంట నానబెట్టాలి. తరువాత కలిపిన చపాతి పిండిని తీసుకొని పెద్ద ముద్దలుగా గుండ్రంగా చేయాలి. ఒక గిన్నెలో చీజ్ తురుము, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, వచ్చిమిర్చి తరుగు, ఉప్పు, గరంమసాలా, చాట్ మసాలా కారం, పసుపు వేసి కలపాలి. ముందుగా తయారు చేసుకున్న పిండి ముద్దను తీసుకొని మందంగా చిన్న చపాతీలా వత్తాలి. ఇందులో చీజ్ మిశ్రమాన్ని పెట్టి పిండిని ఉండలా చేయాలి. తరువాత దాన్ని చపాతిలా వత్తాలి. పెనం వేడిచేసి పరాటాలను బటర్ లేదా నూనె వేసి రెండువైపులా కాల్చుకోవాలి.
మటర్ పరాటా తయారీకి కావలసినవి
- ఉడకబెట్టిన పచ్చిబఠానీ :1/2కప్పు
- కొత్తిమీర తరుగు: 1/4 కప్పు
- పచ్చిమిర్చి తరుగు: 2 టీస్పూన్లు
- వెన్నలేని పెరుగు :1టేబుల్ స్పూన్
- వాము :కొద్దిగా
- ఉప్పు :తగినంత
- గోధుమపిండి : 1 కప్పు
- నూనె లేదా బటర్ :3 స్పూన్లు
- గరంమసాలా : 1/2 టీస్పూన్
- పసుపు: చిటికెడు
తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని అందులోఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. పావుగంట నానబెట్టాలి. తరువాత కలిపిన చపాతి పిండిని తీసుకొని పెద్ద ముద్దలుగా గుండ్రంగా చేయాలి. ఒక గిన్నెలో ఉడికించిన బఠానీలను తీసుకొని చేత్తో మెత్తగా చేయాలి. అందులో కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు ఉప్పు, గరంమసాలా పసుపు వేసి కలిపి పక్కనపెట్టాలి. పిండిముద్దను తీసుకొని పెద్ద ఉండలుగా చేయాలి.
ఒక్కో ఉండను మందంగా చిన్న చపాతీలా వత్తాలి. అందులో ముందుగా తయారుచేసిన పచ్చి బఠానీల మిశ్రమాన్ని పెట్టి పిండిని ఉండగా చేయాలి. తరువాత దాన్ని చపాతీలా వత్తాలి. పెనం వేడిచేసి పరాటాలను బటర్ లేదా నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
ఉల్లిగడ్డ పరాటా తయారీకి కావలసినవి
- ఉల్లిగడ్డ ముక్కలు( సన్నగా తరిగినవి): 3/4 కప్పు
- గోధుమ పిండి: 1కప్పు
- వాము : 1/2 టీస్పూన్
- ఉప్పు: తగినంత
- పచ్చిమిర్చి తరుగు: 2 టీస్పూన్లు
- కొత్తిమీర తరుగు: 2 టేబుల్ స్పూన్లు
- గరంమసాల :1/2 టీస్పూన్
- కారం: 1/2 టీస్పూన్
- పసుపు: చిటికెడు
తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, ఒక స్పూన్ నూనె, వాము, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపాలి. పావుగంట నానబెట్టుకోవాలి. పెద్ద ముద్దలుగా గుండ్రంగా చేయాలి. ఒక గిన్నెలో ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, గరంమసాలా.. కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. పిండిముద్దను ముందు మందంగా తిన్న చపాతిలా చేయాలి. అందులో ఉల్లిగడ్డ మిశ్రమాన్ని పెట్టి పిండిని మళ్లీ ఉండలా చేయాలి. తరువాత దాన్ని మెల్లగా చపాతిలా వత్తాలి. పెనం వేడిచేసి పరాటాలను బటర్ లేదా నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.
