ల్యాండ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రేషన్లకు ‘వసంత పంచమి’ కిక్‌‌‌‌‌‌‌‌.. ఒక్కరోజే 8 వేల డాక్యుమెంట్లు!

ల్యాండ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రేషన్లకు ‘వసంత పంచమి’ కిక్‌‌‌‌‌‌‌‌.. ఒక్కరోజే 8 వేల డాక్యుమెంట్లు!
  • నాన్‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్​ 5 వేలపైన.. అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ 2,700 దాకా
  • సగటుతో పోలిస్తే 2 వేల రిజిస్ట్రేషన్లు అధికం
  • రంగారెడ్డి, మేడ్చల్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో 100% స్లాట్లు ఫుల్

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి సెలవులు, కీడు దినాలు పోయి మంచి రోజులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. శుక్రవారం (జనవరి 23) వసంత పంచమి పర్వదినం కావడంతో కొత్త ఆస్తులు కొనుగోలు, రిజిస్ట్రేషన్లకు జనం ఆసక్తి చూపించారు. దీంతో  సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ కార్యాలయాలు కిటకిటలాడాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే దాదాపు 8 వేల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు దొరక్క పలువురు ఇబ్బందులుపడ్డారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజిగిరి పరిసర జిల్లాల్లోని కార్యాలయాల్లో 100కు వంద శాతం స్లాట్లు బుక్‌‌‌‌‌‌‌‌ కావడంతో,   కొద్ది రోజులుగా వెలవెలబోయిన సబ్​రిజిస్ట్రార్​కార్యాలయాలు సందడిగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రిజిస్ట్రేషన్లలో వ్యవసాయేతర ఆస్తుల డాక్యుమెంట్లే సింహభాగం ఆక్రమించాయి. ఇవి ఏకంగా 5 వేల మార్కును దాటగా, భూ భారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు  2,700 వరకు నమోదయ్యాయి. 

సాధారణ రోజుల్లో జరిగే సగటు రిజిస్ట్రేషన్ల సంఖ్యతో పోల్చి చూస్తే.. వసంత పంచమి నాడు సుమారు 2 వేల డాక్యుమెంట్లు అదనంగా రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్టు అధికారులు తెలిపారు.  మంచి రోజు కావడంతో పాటు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న లావాదేవీలను పూర్తి చేసుకునేందుకు కొనుగోలుదారులు, అమ్మకందారులు పోటెత్తడంతో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఉదయం నుంచే ఆఫీసుల వద్ద రద్దీ కనిపించగా, సర్వర్లు కూడా బిజీగా మారాయి.

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జోరు..

రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్రబిందువుగా ఉన్న హైదరాబాద్ మహానగర పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల జోరు ఎక్కువగా కనిపించింది.  రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ 2 జిల్లాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి 100కు వంద శాతం స్లాట్లు బుక్​కావడం విశేషం. చాలా మంది ముందుగానే స్లాట్లు బుక్ చేసుకోవడంతో అధికారులు కూడా విరామం లేకుండా పని చేయాల్సి వచ్చింది. కేవలం ఈ రెండు జిల్లాలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 

రాష్ట్రంలో క్రమంగా రియల్ బూమ్ పెరుగుతున్నదని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా సంక్రాంతి పండుగకు ముందు, ఆ తర్వాత వచ్చే కొన్ని రోజులను కీడు దినాలుగా భావించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు శుభకార్యాలు లేదా కొత్త ఆస్తుల కొనుగోళ్లకు దూరంగా ఉంటారు. ఈ సెంటిమెంట్ కారణంగా గత వారం, పది రోజులుగా రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగాయి. 

కానీ కీడు దినాలు ముగియడం, శుక్రవారం వసంత పంచమి (శ్రీ పంచమి) కావడంతో ఒక్కసారిగా  డిమాండ్​ పెరిగింది. ఈ రోజున కొత్త పనులు, కొత్త ఆస్తుల కొనుగోళ్లు చేపడితే అంతా శుభం జరుగుతుందన్న నమ్మకంతో ప్రజలు రిజిస్ట్రేషన్లకు ఎగబడ్డారు.  రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ముహూర్తాలు కూడా ఉండడంతో రిజిస్ట్రేషన్ల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.