తెలంగాణ భవన్కు వాస్తు మార్పులు .. ఈశాన్యం వైపు నుంచి రాకపోకలు

తెలంగాణ భవన్కు వాస్తు మార్పులు ..  ఈశాన్యం వైపు నుంచి రాకపోకలు

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు.. తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు నేతల వలసలు కూడా పెరిగాయి. వాస్తుదోషం కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని భావిస్తున్న నాయకులు వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు.  ప్రధానమైనది కార్యాలయంలోకి వెళ్లే గేటు. తెలంగాణ భవన్‌ తూర్పు అభిముఖంగా ఉండగా.. వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. 

అలా రావడం మంచిది కాదని, ఈశాన్యం వైపు ఉన్న గేటును ఇకనుంచి రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈశాన్యం వైపు ఉన్న గేటును సిద్ధం చేస్తున్నారు. వాహనాల కోసం ర్యాంపు నిర్మిస్తున్నారు. వీధి పోటును దృష్టిలో ఉంచుకొని లక్ష్మీనరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని కూడా గేటుకు ఏర్పాటు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా రాకపోకలను వాయువ్యం నుంచి ఈశాన్యం వైపునకు మార్చడానికి ట్రాఫిక్‌ సమస్య కూడా కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 వైపు వెళ్లే ప్రధాన రహదారి వెంట వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. దీంతో తెలంగాణ భవన్‌లోకి వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతోంది. ఒకటి, రెండు వాహనాలు కూడా వాయువ్యం దిశలో ఉన్న గేటు వద్ద కాసేపు కూడా నిలిపి ఉంచే పరిస్థితి లేదు. దీంతో ఈశాన్యం గేటును రాకపోకలకు ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్‌ సమస్యను అధిగమించవచ్చని భావిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వాస్తు మార్పిడి కార్యక్రమం ఎన్ని ఎంపీ సీట్లను తెచ్చిపెడుతుందో చూడాలి.