వాస్తు బ్రహ్మ.. కాశీనాధుని సుబ్రమణ్యం శివైక్యం

వాస్తు బ్రహ్మ.. కాశీనాధుని సుబ్రమణ్యం శివైక్యం

కాశీనాధుని వారింట భైరవమూర్తి అయ్యగారు-అన్నపూర్ణ దంపతులకు 1928లో జన్మించారు కాశీనాధుని సుబ్రమణ్యం. పాత్రికేయ రంగంలో, వాస్తు రంగంలో విశిష్ట సేవలందించిన సుబ్రమణ్యం18 ఏళ్ల వయసులో తండ్రి భైరవమూర్తి చనిపోవడంతో ఇంటర్ తర్వాత చదువు ఆపేశారు. 22వ ఏట సుబ్రమణ్యం ప్రింటింగ్ ప్రెస్ నిర్వహణలో మెలకువలు నేర్చుకుని ప్రచురణ రంగంలో అడుగుపెట్టారు. ఆయన మేనమామ, ప్రముఖ కంటి వైద్య నిపుణులు ముదిగొండ కోటేశ్వరరావు కుమార్తె విమలతో ఆయనకు 1956లో పెళ్లైంది. 1960 దశకంలో హైదరాబాద్ నిజాం కళాశాలలో ఈవినింగ్ కోర్సులో డిగ్రీ పూర్తి చేశారు. ప్రింటింగ్ రంగంలో పట్టుసాధించిన ఆయన ప్రముఖ దిన పత్రిక కృష్ణాపత్రిక ప్రచురణ బాధ్యతలను చేపట్టారు. 1967 వరకు దశాబ్దకాలం పాటు ఆ బాధ్యతలు నిర్వహించిన సుబ్రమణ్యం సాహిత్యం, రాజకీయాలు, వేదాంతం, హాస్యం, సినిమా, రంగస్థల కార్యక్రమాల సమీక్షలు, స్థానిక వార్తలతో సర్వాంగ సుందరంగా పత్రికను ప్రచురించేవారు.

కృష్ణాపత్రిక ప్రచురణ అనుభవంతో సుబ్రమణ్యం 1967లో సొంతంగా చుక్కాని అనే పక్ష పత్రికను ప్రారంభించారు. తర్వాత దీనిని వార పత్రికగాను, దినపత్రికగాను కొనసాగించారు. సాంఘీక, సామాజిక, రాజకీయ విశేషాలతో పాటు తొలిసారి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక పేజీని నిర్వహించారు. సినిమా విశేషాలు, సాహిత్య పేజీలు ఉండేవి. జ్యోతిషం, వారఫలాలు కూడా పొందుపరిచేవారు. దీంతో ఆయన పేరు చుక్కాని సుబ్రమణ్యంగా స్థిరపడిపోయింది. సంపాదక స్థాయి బాధ్యతలను నిర్వహించిన సుబ్రమణ్యం సంప్రదాయాలకు ఎంత విలువ ఇచ్చారో మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడంలో అంతే ముందున్నారు. సంప్రదాయాలను పాటించే ఆధునికవాది ఆయన.

పాత్రికేయంతో పాటు సుబ్రమణ్యం వాస్తుశాస్త్రాన్ని అందరికీ పంచారు. భారతదేశంతో పాటు వివిద దేశాలకు చెందిన ప్రముఖులు సుబ్రమణ్యం గారిని వాస్తు సలహాల కోసం సంప్రదించేవారు. నిర్మాణ స్థలాన్ని ఒక్కసారి పరిశీలిస్తే చాలు దోషాలను కనిపెట్టగల వాస్తుజ్ఞానీ ఆయన. ఏదైనా స్థలం వాస్తుపరంగా అనుకూలంగా ఉందని ఒకసారి ఆయన నిర్ధారిస్తే ఇక దానికి తిరుగుండదని చెబుతారు. సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తలు, వానిజ్య ప్రముఖులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు వివిధ హోదాలలో ఉన్నవారు సుబ్రమణ్యం నుంచి వాస్తు సలహాలు తీసుకునేవారు. దుబాయ్ లో అరబ్ షేక్ కూడా సుబ్రమణ్యం గురించి తెలిసి ప్రత్యేకంగా పిలిపించుకున్నారు.

ఒక ఏడాది కాలంలోనే పదిసార్లు దుబాయ్ వెళ్లి షేక్ చేపట్టిన నిర్మాణాలకు వాస్తు సలహాలిచ్చారు సుబ్రమణ్యం. కెన్యా, సింగపూర్, లాంటి పలు దేశాలకు వెళ్లి అక్కడ అధికార ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలకు ఆయన వాస్తు సలహాలు ఇచ్చేవారు. దేశంలోని ప్రముక పారిశ్రామికవేత్తలు బిర్లా లాంటి వారు అనేక మంది కొత్త నిర్మాణాలు చేపట్టడానికి సుబ్రమణ్యం వాస్తు సలహాలు తీసుకునేవారు. వసంత కెమికల్స్ చౌదరి, టీవీఎస్ సంస్థ అధిపతి వికె శ్రీనివాస్, బాంబే డైయింగ్, జీవీకే ఇండస్ట్రీస్, సిద్ధి సిమెంట్స్ వంటి సంస్థల ప్రముఖులు ఆయన సలహాలను కచ్చితంగా పాటిస్తారు. 50కి పైగా సినిమా థియేటర్ల నిర్మాణాలతో పాటు లెక్కలేనన్ని భవన నిర్మాణాలకు, పొలాలకు, కాలనీలకు, హాస్పిటళ్లకు, బస్ డిపోలకు సుబ్రమణ్యం వాస్తు సలహాలు అందించారు.

ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆహ్వానంతో భద్రాచలం, యాదగిరిగుట్ట దేవస్థానాల్లోనూ వాస్తు మార్పులను సూచించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పలు ప్రముఖ సంస్థలవారు పలు సందర్బాల్లో సుబ్రమణ్యాన్ని సత్కరించారు. భారత వాస్తు విజ్ఞాని,  సర్వజ్న, వాస్తు సామ్రాట్, వాస్తు బ్రహ్మ వంటి బిరుదులతో అనేక తెలుగు సంఘాలు సన్మానించాయి. ఆయన పురాతన దేవాలయాల పునరుద్దరణకు తవవంతు ఆర్థిక సాయం అందించేవారు. శైవమత ప్రచారం లక్ష్యంగా వందేళ్ల క్రితం ఆవిర్బవించిన శ్రీశైవ మహాపీఠం కార్యకలాపాలతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. హైదరాబాద్ నాగోల్ లోని శ్రీకాళీవిశాలాక్ష్మి సమేత కాళీవిశ్వేశ్వర స్వామి దేవాలయ నిర్మాణంలో సుబ్రమణ్యం సహకారం అందించారు. ఇక్కడ శైవారాధకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కాలనీ నిర్మాణంలో కీలకంగా పనిచేశారు. శైవమత ప్రచారంలో లింగధారులు మెడలో ధరించడానికి వీలుగా స్పటిక లింగాలను తయారు చేయించి వేలాదిమందికి ఉచితంగా అందించారు.

సుబ్రమణ్యం –విమల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు నాగరాజు ఐపీఎస్ అధికారి. రెండో కుమారుడు శ్రీనివాస్ తండ్రి బాటలోనే వాస్తు నిపుణుడిగా కొనసాగుతున్నారు. కుమార్తె సరోజా వివేకానంద్ విశాక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా, ప్రముఖ మహిళా వ్యాపారవేత్తగా, విద్యావేత్తగా ఎదిగారు. వృద్ధాప్యంలోనూ ఓపికగా వాస్తు సూచనలు చేస్తూ వచ్చిన సుబ్రమణ్యం 91 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.