నా స్టాప్ వచ్చేసింది.. బస్ దిగిపోతున్నా.. సజ్జనార్ ఇంట్రస్టింగ్ ట్వీట్

నా స్టాప్ వచ్చేసింది.. బస్ దిగిపోతున్నా.. సజ్జనార్ ఇంట్రస్టింగ్ ట్వీట్

హైదరాబాద్: TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా బదిలీ కావడంపై వీసీ సజ్జనార్ భావోద్వేగానికి లోనవుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన స్టాప్ వచ్చేసిందని.. బస్సు దిగి కొత్త మార్గం వైపు అడుగులేసే సమయం వచ్చిందని ఆయన పోస్ట్ చేశారు. ప్రయాణాలు ముగుస్తుంటాయని, ప్రయాణికులు దిగిపోతుంటారని.. కానీ రోడ్డు మాత్రం ఎప్పటికీ అలానే ముందుకు సాగుతుందని సజ్జనార్ ట్వీట్ చేశారు. బస్ పార్క్ చేసి.. సరికొత్త సవాల్ వైపు దూసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. టీజీఎస్ఆర్టీసీకి లైఫ్ లైన్ అయిన ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్టీసీ సంస్థతో, ఉద్యోగులతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ అన్నారు. నాలుగేళ్ల పాటు ఎండీగా పని చేశానని.. ఈ సమయంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఆర్టీసీ ఎండీ నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బదిలీ అవుతున్న క్రమంలో.. ఆర్టీసీ అధికారులు బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళా భవన్లో వీడ్కోలు సభ నిర్వహించారు.

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేశానని సజ్జనర్ అన్నారు. ఉద్యోగులపై దాడులు జరిగినప్పుడు , కఠినంగా వ్యవహరించమని పేర్కొన్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ నటించిన ఓ యాడ్లో ఆర్టీసీ సంస్థను ప్రతిష్టను దిగజారిన విషయంలో లీగల్ నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నాలుగేళ్ళ సమయంలో ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించిన ఉద్యోగులకు సజ్జనర్ ధన్యవాదాలు తెలిపారు.