బషీర్‌బాగ్, వెలుగు: అర్బన్ రీజినల్ ప్లానర్‌గా, వారసత్వ సంరక్షకుడిగా పేరుగాంచిన మణికొండ వేదకుమార్ మరోసారి ప్రతిష్ఠాత్మక బాధ్యతను దక్కించుకున్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్(ఇంటాక్) గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన వరుసగా నాలుగోసారి మూడు సంవత్సరాల కాలానికి ఎన్నికయ్యారు. వేదకుమార్ ఏపీ, తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లోని స్మారక చిహ్నాలు, చారిత్రక భవనాలు, సాంస్కృతిక, సహజ వారసత్వ ప్రదేశాల గుర్తింపు, సంరక్షణ, పరిరక్షణకు కృషి చేస్తున్నారు.
అనేక దేశాలను సందర్శించి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన ఆయన, పలు అంతర్జాతీయ వారసత్వ సదస్సుల్లో పాల్గొని భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. తెలంగాణ ప్రభుత్వ హెరిటేజ్ విభాగంతో కలిసి పనిచేసి ముడుమల మెగాలిథిక్ మెన్హిర్స్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.
