కిలో టమాటా రూ.100,,,పచ్చిమిర్చి 120..కొనలేక జనం విలవిల

కిలో టమాటా రూ.100,,,పచ్చిమిర్చి 120..కొనలేక జనం విలవిల
  • వంకాయ, కాకర, బీర.. ఏదైనా రూ.70 పైమాటే
  • ఏప్రిల్, మేలో చెడగొట్టు వానలు.. ఆ ఎఫెక్ట్​ ఇప్పుడు
  • చికెన్‍, మటన్‍ రేట్లతో పోటీ.. కొనలేక జనం విలవిల 
  • కరీంనగర్​లో సెంచరీ 
  • మిగిలిన చోట్ల రూ.80 దాకా..
  • భయపెడ్తున్న కూరగాయల రేట్లు
  • వంకాయ, కాకర, బీరకాయ ఏదైనా కిలో రూ.70 పైమాటే

వరంగల్, వెలుగు: కూరగాయల రేట్లు భయపెడుతున్నాయి. ప్రతి కూరలో కచ్చితంగా వాడే టమాట కిలో రూ.100 పలుకుతుండగా, పచ్చిమిర్చి రూ.120కి చేరింది. ఇక వంకాయ, కాకర, బీరకాయ ఇలా ఏది కొన్నా కిలో రూ.70కి తక్కువ లేదు. ఈ ధరలు కూడా హోల్‍సేల్‍ రేటుకు దొరికే మాల్స్​, రైతుబజార్లలోనివి మాత్రమే. కాలనీలకు అందుబాటులో ఉండే షాపుల్లో అదనంగా రూ.20 నుంచి రూ.30 వరకు ఎక్కువకు అమ్ముతున్నారు. ఎండాకాలం మొదట్లో కిలో టమాటా రూ.6 నుంచి రూ.8 వరకు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.90 నుంచి 100కు పెరిగింది. కూరగాయల ధరలు చికెన్‍, మటన్​, చేపల రేట్లతో పోటీ పడుతుండడంతో పేద, మధ్య తరగతి జనాలు కూరగాయల షాపుకు వెళ్లడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.  

అగ్గి మండుతున్న కూరగాయల రేట్లు

ఏటా ఎండాకాలంలో కూరగాయల రేట్లు ఎంతో కొంత పెరగడం సహజం. కానీ, గతానికి భిన్నంగా ఈసారి వర్షాకాలం మొదలైనా రేట్లు మండిపోతున్నాయి. ఒకటో రెండో కూరగాయల ధరలు పెరిగాయంటే ఏదో కారణం ఉందనుకోవచ్చు కానీ, అన్నింటి ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. సోమవారం కరీంనగర్​, నిజామాబాద్‍లలో కిలో టమాట రూ.100 పలకగా..హైదరాబాద్‍ ఎర్రగడ్డ రైతు బజార్‍తో పాటు వరంగల్‍, ఖమ్మం జిల్లాల్లో రూ.90 ఉంది. పచ్చిమిర్చి గత వారం రూ.40 నుంచి 50 వరకు ఉండగా..సోమవారం దాదాపు అన్నిచోట్లా కిలో రూ.120 చొప్పున అమ్మారు.

 కరీంనగర్‍లో బీరకాయ ఏకంగా రూ.100కు చేరగా, నిజామాబాద్‍లో రూ.80, వరంగల్​లో రూ.70 నుంచి 80 మధ్య అమ్మారు. ఖమ్మం మార్కెట్​లో చిక్కుడుకాయ రూ.86, కరీంనగర్‍లో రూ.85, ఇతర జిల్లాల్లో రూ.70 నుంచి రూ.80 వరకు అమ్మారు. కాకర కాయ పరిస్థితీ ఇంతే. బెండకాయ, దొండకాయ, వంకాయ, క్యారెట్‍ ధరలు నిజామాబాద్‍లో రూ.80 ఉండగా.. వరంగల్‍, కరీంనగర్‍లో రూ.70 వరకు చేరాయి. క్యాప్సికం కరీంనగర్‍లో కిలో రూ.100 ఉండగా, నిజామాబాద్​, వరంగల్​లలో రూ.80 నుంచి రూ.90 మధ్య విక్రయించారు. 

ఐదు రోజుల్లో రూ.60 పెరిగిన టమాట

మే నెల మొదటివారం వరకు రూ.10 లోపే ఉన్న టమాట ఇప్పుడు వందకు చేరింది. గడిచిన 5 రోజుల్లో కిలోమీద ఏకంగా రూ.60 పెరిగింది. 5 రోజుల క్రితం రూ.40 అమ్మినచోట ఇప్పుడు రూ.100 అమ్ముతున్నారు. కరీంనగర్‍ , నిజామాబాద్​ జిల్లాల్లో రూ.100కు విక్రయిస్తున్నారు. రెండేండ్ల క్రితం పంటలు సాగు చేయని సమయంలో సైతం గరిష్ఠంగా కిలో టమాట రూ.80 పలకగా.. ఇప్పుడు ఆ ధరలను బ్రేక్‍ చేశాయి. గత ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలతో టమాట తోటలు దెబ్బతినడంతో డిమాండ్​ పెరిగి సప్లయ్​ లేక ధరలు పెరిగినట్టు తెలుస్తోంది.  

జీతంలో సగానికి పైగా కూరగాయలకే..

మార్కెట్​లో చికెన్‍ ప్రస్తుతం రూ.300, మటన్‍ రూ.800 ఉంది. ఆదివారం వచ్చిందంటే పేదలు చికెన్‍, కొంత ఉన్నోళ్లు మటన్‍ తినేందుకు ఇష్టపడతారు. కాగా, ఇప్పుడు దాదాపు అవే రేట్లు ప్రతిరోజు కూరగాయలకు పెట్టాల్సి వస్తోంది. ఇంట్లో నలుగురుంటే అన్నంలోకి మూడు పూటలకు సరిపడే కూరగాయలకు తక్కువలో తక్కువ రూ.200 నుంచి 300 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ లెక్కన వారానికే రూ.1400 నుంచి రూ.2 వేలు అవుతోంది. నెలకు రూ.10 నుంచి 15 వేలు సంపాదించే వారు సగానికి పైగా జీతం డబ్బులను కూరగాయలకే పెట్టాల్సి రావడం కలవరపరుస్తోంది. ఇట్లాగే కొనసాగితే ఇంటి కిరాయిలు, కరెంట్ బిల్లులు, పిల్లల స్కూల్‍ ఫీజులు కట్టడం కష్టమవుతుందని భయపడుతున్నారు. 

ఆకాశంలో ఆకుకూరల రేట్లు

కూరగాయల ధరలే చుక్కలు చూపిస్తున్నాయంటే ఆకు కూరల ధరలు అడగలేని పరిస్థితి ఉంది. నిన్నమొన్నటి వరకు ఆకుకూరల కట్టలు ఒక్కొక్కటి రూ.5 వరకు దొరికేవి. ఇప్పుడు రూ.20 వరకు చెబుతున్నారు. కొత్తిమీర కిలో రూ.240 (కట్ట రూ.20), మెంతి, పాలకూరలు రూ.100, పుంటి కూర, గంగవాయిలి కూరలు రూ.80 చొప్పున అమ్ముతున్నారు. కాలనీల వద్దకు వచ్చేసరికి డిమాండ్‍ ఆధారంగా వీటిపై కొందరు రూ.10 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.  

అప్పటి వానల ఎఫెక్ట్​.. 

ఏప్రిల్​, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా కూరగాయ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజానికి ఎండాకాలంలో కూరగాయల ఉత్పత్తి పడిపోయి రేట్లు పెరుగుతాయి. కానీ, ఏప్రిల్​, మే నెలల్లో టమాట రేట్లు దారుణంగా పతనమయ్యాయి. ఒక దశలో రైతుకు రూ.2 నుంచి రూ.3లోపే పడడంతో మహబూబ్​నగర్, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో రైతులు తోటలు తొలగించుకున్నారు. మరోవైపు జూన్​ మూడోవారం దాకా వర్షాలు లేకపోవడంతో అడపాదడపా ఉన్న తోటలు చాలాచోట్ల ఎండిపోయాయి. 

ఈ ఎఫెక్ట్ ​ఇప్పుడు కనిపిస్తోందని వ్యాపారులంటున్నారు.రాష్ట్రంలో దిగుబడులు తగ్గిపోవడం, డిమాండ్​కు సరిపడా సరుకు ఇతర రాష్ట్రాల నుంచి రాకపోవడంతో రేట్లు పెరిగాయని చెప్తున్నారు. మరోవైపు వ్యాపారులే బ్లాక్​ చేసి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. ఏదేమైనా నిన్నమొన్నటి వరకు రూ.200 పట్టుకొస్తే నాలుగు రకాల కూరగాయలు వచ్చేవని, రెండు, మూడు రోజులుగా  అవే కూరగాయలకు రూ.500 వరకు పెట్టాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో కిలో కొనాల్సిన చోట అరకిలో కొనుక్కుని సరిపెట్టుకుంటున్నారు.

టమాట, మిర్చి రేట్లు డబులైనయ్‍

వారం రోజుల్లోనే టమాట, మిర్చి రేట్లు డబుల్‍ కంటే ఎక్కువైనయ్‍. టమాట కిలో రూ.40 అమ్మినోళ్లు ఈరోజు బాలసముద్రం మార్కెట్​లో రూ.100 అంటున్రు. మిర్చి రూ.40, 50కి తీసుకెళ్లేదాన్ని. ఇప్పుడు దానికి రూ.120 చెబుతున్రు. గతంలో మాదిరి కూరగాయలు కొనడానికి రెండు మూడొందలు పట్టుకొస్తే.. సంచి నిండేకాడ చిన్న కవర్‍ కూడా నిండట్లేదు. ఆకు కూరలు అట్లనే ఉన్నయ్. ఇవే ధరలు ఇంకో వారం, పది రోజులుంటే తట్టుకోవడం కష్టం.

–బి.స్వప్న,రాంనగర్‍, హనుమకొండ

ఇంత రేట్లు ఎప్పుడూ చూడలే 

కూరగాయల రేట్లు ఇంత పిరమవడం ఎప్పుడూ చూడలే. కాలం కానప్పుడు, ఎండా కాలంలో కొన్ని కూరగాయలు దొరకవు కాబట్టి రూ.పదో..ఇరవయ్యో పెరుగుతయ్‍. కానీ, వారంలోనే ఏకంగా మూడు, నాలుగింతలు పెరిగినయ్‍. అసలు ఏం కొనాలో అర్థం కావట్లేదు. నిన్నమొన్నటి వరకు కిలో చొప్పున పట్టుకుపోయేవాడిని ఇప్పుడు సగం..సగం తీసుకువెళ్తూ అడ్జస్ట్​చేసుకుంటున్నాం.

ALSO READ:డేటా డిలీట్ చేసి తప్పించుకోలేరు.. బ్యాకప్ సెల్ పట్టిస్తది

–క్రిష్టమూర్తి, బాలసముద్రం, హనుమకొండ

కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. కిలో టమాటా రూ.100కు చేరింది. పచ్చిమిర్చి రూ.120. వంకాయ, కాకర, బీరకాయ.. ఏది కొన్నా కిలో రూ.70కి తక్కువ లేదు.  ఎండాకాలం ప్రారంభంలో  కిలో టమాటా రూ.6 నుంచి 8 ఉండగా, ఇప్పుడు ఏకంగా పది పన్నెండు రెట్లు పెరిగింది. కూరగాయల ధరలు చికెన్‍, మటన్​, చేపల రేట్లతో పోటీ పడుతుండడంతో పేద, మధ్య తరగతి జనాలు కూరగాయల షాపుకు వెళ్లడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.  ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలతో టమాటా తోటలు దెబ్బతిన్నాయి. ఆ ప్రభావం వల్లే ఇప్పుడు ధరలు పెరిగాయని అంటున్నారు. నిన్నమొన్నటి వరకు ఒక్కో ఆకు కూర కట్ట రూ.5 ఉండేది. ఇప్పుడు రూ.20 చెబుతున్నారు. నిన్నమొన్నటి వరకు రూ.200కు నాలుగు రకాల కూరగాయలు వచ్చేవని, ఇప్పుడు రూ.500 వరకు పెట్టాల్సి వస్తోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.