డేటా డిలీట్ చేసి తప్పించుకోలేరు.. బ్యాకప్ సెల్ పట్టిస్తది

డేటా డిలీట్ చేసి తప్పించుకోలేరు.. బ్యాకప్ సెల్ పట్టిస్తది
  •     డేటా మాయం చేసి తప్పించుకునేందుకు యత్నం
  •     దర్యాప్తులో కీలకంగా మారిన ‘బ్యాకప్ సెల్స్’
  •      ‘డిజిటల్ ఎవిడెన్స్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌’తో  20 జీబీవరకు డేటా రికవరీకి చాన్స్
  •     ఈ ఏడాది 23 కీలక కేసుల్లో సాక్ష్యాధారాలు సేకరించిన సీఐడీ, సైబర్ క్రైమ్ పోలీసులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  పోలీస్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌లో టెక్నాలజీ కీ రోల్ పోషిస్తోంది. ఆన్‌‌‌‌లైన్ అడ్డాగా సాగుతున్న నేరాలకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలోని డేటా బ్యాకప్‌‌‌‌ సెల్‌‌‌‌, సీఐడీ సెంట్రల్ ఆఫీసులోని డిజిటల్‌‌‌‌ ఎవిడెన్స్‌‌‌‌ ల్యాబ్ ద్వారా సీఐడీ, సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్ పోలీసులు చెక్ పెడుతున్నారు. నేరం చేసిన తర్వాత డిలీట్, ఫార్మాట్‌‌‌‌ చేసిన సెల్‌‌‌‌ఫోన్లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌, కంప్యూటర్ల హార్డ్ డిస్క్ నుంచి పోలీసులు డేటా రికవరీ, బ్యాకప్‌‌‌‌ చేయడంలో సక్సెస్‌‌‌‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించిన టీఎస్‌‌‌‌పీఎస్సీ పేపర్స్‌‌‌‌ లీకేజీతో పాటు డ్రగ్స్‌‌‌‌, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాల కేసుల్లో పోలీసులు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. టీఎస్‌‌‌‌పీఎస్సీ కేసులో నిందితుల నుంచి పేపర్లు కొనుగోలు చేసి పరీక్షలు రాసిన అభ్యర్ధులు, దళారుల ఫోన్లు, ల్యాప్‌‌‌‌టాప్స్‌‌‌‌ డేటాతో ఇన్వెస్టిగేషన్ చేశారు. డిలీట్‌‌‌‌ చేసిన డేటాను రికవరీ చేసి కోర్టులో సాక్ష్యాధారాలుగా డిపాజిట్ చేశారు. కాల్‌‌‌‌డేటా, వాట్సాప్ చాటింగ్‌‌‌‌ ఆధారంగా పేపర్ వంద మందికిపైగా చేతులు మారినట్టు గుర్తించారు. 

సోషల్‌‌‌‌ మీడియాలో వేధింపులు..  

వాట్సాప్, ఫేస్‌‌‌‌బుక్, ట్విట్టర్​తో పాటు ఇతర సోషల్‌‌‌‌ మీడియా యాప్స్ సైబర్‌‌‌‌‌‌‌‌ వేధింపులకు అడ్డాలుగా మారాయి.ఫేక్ ప్రొఫైల్స్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేస్తున్న నేరగాళ్లు.. మహిళలు,సెలబ్రిటీలు, రాజకీయ నేతలపై అసభ్యకర వీడియోలు, ఫొటోలతో వేధిస్తున్నారు. మార్ఫింగ్ చేసిన ఫొటోస్‌‌‌‌, వీడియోస్‌‌‌‌ పోస్టింగ్స్ చేస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్​కు  పాల్పడుతున్నారు. లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌కు విఘాతం కలిగేలా కమ్యూనల్‌‌‌‌ వీడియోస్‌‌‌‌ను సోషల్ మీడియాలో సర్క్యులేట్‌‌‌‌ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు స్మార్ట్, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌తో వరుస నేరాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ సప్లయర్స్‌‌‌‌ మొబైల్ యాప్స్, వాట్సాప్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో ఆర్డర్స్ బుకింగ్‌‌‌‌ డెలివరీ చేస్తున్నారు. ఇలా నేరం చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా మొబైల్, కంప్యూటర్లలోని డేటాను డిలీట్ చేసి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

రికవరీ టూల్స్‌‌‌‌తో .. 

స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌‌‌‌టాప్, కంప్యూటర్ సహా ఎలాంటి డిజిటల్ డివైజ్​లోని డేటానైనా సరే డిలీట్ చేస్తే.. దాన్ని పోలీసులు రికవరీ చేస్తున్నారు. రాష్ట్ర సీఐడీ, ఫోరెన్సిక్ సైన్స్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌తో పాటు గ్రేటర్‌‌‌‌‌‌‌‌లోని మూడు కమిషనరేట్ల సైబర్‌‌‌‌‌‌‌‌క్రైమ్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. డేటా బ్యాకప్ కోసం స్పెషల్ సెల్స్ ఏర్పాటు చేశారు. సిటీ సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌లో 2017 జనవరిలో మొట్టమొదటి డేటా బ్యాకప్ సెల్‌‌‌‌ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని సైబర్ క్రైమ్‌‌‌‌ యూనిట్లలో బ్యాకప్‌‌‌‌ సెల్‌‌‌‌, స్పెషల్ టీమ్స్‌‌‌‌ను నియమించారు. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలో రిజిస్టరైన కేసుల్లో సీజ్ చేసిన ఫోన్ల డేటాను కూడా బ్యాకప్ సెల్‌‌‌‌ ద్వారా రికవరీ చేస్తున్నారు. సంబంధిత కేసుల్లో డిజిటల్ ల్యాబ్ అందించిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ALSO READ:హిమాచల్​ప్రదేశ్​లో కుండపోత.. కులు, మండి జిల్లాల్లో ఎడతెగని వర్షాలు

60 సెకన్లలో..

లక్డీకపూల్​లోని స్టేట్‌‌‌‌ ఫోరెన్సిక్‌‌‌‌ ల్యాబ్, సీఐడీ సెంట్రల్ ఆఫీసులో ‘డిజిటల్ ఎవిడెన్స్‌‌‌‌ ల్యాబ్’  రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే కీలక కేసుల్లో డేటా బ్యాకప్ చేస్తోంది.  ఇందులో ‘యూనివర్సల్ ఫోరెన్సిక్ ఎక్స్‌‌‌‌ట్రాక్షన్ డివైజ్  ద్వారా నిమిషం వ్యవధిలో 3 వేల వరకు లాజికల్, ఫిజికల్ మొబైల్ డేటాను బ్యాకప్ చేయొచ్చు. చైనా ఫోన్ల బ్యాకప్ కోసం ‘టారంటులా’  అనే ఈ డిజిటల్ డివైజ్​ను వాడుతున్నారు. దీని ద్వారా1 జీబీ నుంచి 20 జీబీ వరకు ఎలాంటి డేటా నైనా సరే నిమిషాల్లో బ్యాకప్ చేయవచ్చు. దీంతో పాటు నేరాలకు ఉపయోగించిన కంప్యూటర్లు,ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌ల నుంచి తొలగించిన ఎలాంటి డేటా నైనా సరే నిమిషాల వ్యవధిలోనే రికవరీ చేస్తున్నారు. ఇలా సీఐడీ సైబర్‌‌‌‌‌‌‌‌క్రైమ్ యూనిట్‌‌‌‌తో పాటు గ్రేటర్‌‌‌‌‌‌‌‌లోని  3 కమిషనరేట్ల సైబర్‌‌‌‌‌‌‌‌క్రైమ్ పోలీసులు ఈ ఏడాది సుమారు 23 కేసుల్లో కీలక ఆధారాలు సేకరించారు.

బ్యాకప్ సెల్​తో  ఎన్నో కేసులు ఛేదించాం 

 ఇంటర్నెట్‌‌‌‌ ఆధారిత స్మార్ట్‌‌‌‌ఫోన్లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎలాంటి నేరం చేసినా దొరికిపోతారు. సోషల్‌‌‌‌ మీడియాలో మహిళలను వేధించడం, అసభ్యకర వీడియోలు, ఫొటోస్ పోస్ట్‌‌‌‌ చేసి డిలీట్‌‌‌‌ చేయడం లాంటి కేసులను బ్యాకప్ సెల్స్​తో ట్రేస్ చేస్తున్నం.  డిలీట్‌‌‌‌ చేసిన డేటాను, ఫార్మాట్‌‌‌‌ చేసిన ఫోన్ల నుంచి కూడా డేటాను సేకరించగలం. డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో అత్యాధునిక టెక్నాలజీ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ ఉన్నారు. డేటా బ్యాకప్‌‌‌‌ సెల్‌‌‌‌తో అనేక కేసులు ఛేదించాం. నేరస్తులకు శిక్షలు పడేలా కోర్టులో ఆధారాలు ప్రవేశపెడుతున్నాం. 
– కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సైబర్ క్రైమ్