కూరగాయల ధరలు భగ్గుమంటున్నయ్

కూరగాయల ధరలు భగ్గుమంటున్నయ్
  • వర్షాల వల్ల దిగుమతి తగ్గడంతో భారీగా పెరిగిన రేట్లు
  • రిటైల్ మార్కెట్‌‌లో ఏవీ కిలో రూ.60కి తక్కువ లేవు
  • బోయిన్‌‌పల్లి మార్కెట్‌‌లో ఒక్కరోజే 5,260 క్వింటాళ్ల దిగుమతి తగ్గింది
  • రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరిగే అవకాశం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మార్కెట్లకు కూరగాయలు రావడం తగ్గుతోంది. దీంతో ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల్లో ఏవి కొందామన్నా కిలో రూ.60కు తక్కువ ఉండటం లేదు. ఈ నెల ప్రారంభంలో ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. పరిస్థితి ఇలానే ఉంటే వెజిటబుల్స్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోనే పెద్దదైన బోయిన్‌‌పల్లి హోల్‌‌సేల్‌‌ మార్కెట్‌‌కు గురువారం 18,723 క్వింటాళ్ల కూరగాయలు రాగా.. శుక్రవారం 13,463 క్వింటాళ్లే వచ్చాయి. అంటే ఒక్కరోజుకే 5,260 క్వింటాళ్ల కూరగాయల దిగుమతి తగ్గింది. ఇదే మార్కెట్‌‌కు గత శనివారం 455 లోడ్ల వెజిటబుల్స్ రాగా.. శుక్రవారం 210 లోడ్లు మాత్రమే వచ్చాయి. మార్కెట్‌‌కు వచ్చే కూరగాయలు కూడా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ నుంచే దిగుమతి అవుతున్నాయి. శుక్రవారం ఏపీ నుంచి 31 వాహనాల్లో, మహారాష్ట్ర నుంచి 36, కర్నాటక నుంచి 35, యూపీ నుంచి 31 వాహనాల్లో వెజిటబుల్స్ వచ్చాయి.

రేట్లు మండిపోతున్నయ్
కూరగాయల దిగుమతి తగ్గి.. ధరలు మరింత పెరిగాయి. బెండకాయ, వంకాయ, చిక్కుడు కాయ, దోసకాయ, బీరకాయ, శ్యామగడ్డ.. ఏది తీసుకున్నా కిలో రూ.60కి తక్కువ అమ్మడం లేదు. కాకరకాయ, పచ్చిమిర్చి, బీన్స్‌‌ కిలో రూ.80 వరకు, బోడకాకర కాయ కిలో రూ.200 వరకు అమ్ముతున్నారు. టమాటా ధర ఈనెల ప్రారంభంలో కిలో రూ.8 నుంచి రూ.12 వరకు ఉంటే ఇప్పుడు రూ.35 నుంచి రూ.40 వరకు అమ్ముతున్నరు. హోల్‌‌సేల్‌‌లో కూడా టమాటా కిలో రూ.28 నుంచి రూ.32 వరకు ధర పలుకుతోంది.

రాష్ట్రంలో పంట నష్టం

వారం రోజులపాటు తెరిపి లేకుండా వర్షాలు కురవడంతో రాష్ట్రంలో సాగు చేసిన కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది. తీరా కోత టైమ్‌‌లో వర్షాలు రావడంతో టమాటా, బీరకాయ, వంకాయ, దోసకాయ పంటలు డ్యామేజ్ అయ్యాయి. టమాటాలు చెట్టుమీద కుల్లిపోయాయి. లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతులకు అకాల వర్షాలు నష్టాలు తెచ్చిపెట్టాయి. రంగారెడ్డి, మెదక్‌‌, వికారాబాద్‌‌, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వేలాది ఎకరాలపై వానల ప్రభావం పడింది. దీంతో స్థానికంగా పండిన పంటలు మార్కెట్‌‌కు రావడం తగ్గిపోయింది.