టమాట రూ.100.. పచ్చిమిర్చి 120..రోజు రోజుకూ పెరుగుతున్నా కూరగాయల రేట్లు

టమాట రూ.100.. పచ్చిమిర్చి 120..రోజు రోజుకూ పెరుగుతున్నా కూరగాయల రేట్లు
  •     నాలుగు నెలల నుంచి రూ.200 తగ్గని అల్లం, వెల్లుల్లి
  •     రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు

నిజామాబాద్​, వెలుగు : జిల్లాలో కూరగాయల రేట్లు  రోజు రోజుకూ పెరుగుతున్నాయి.   టమాట ధర కిలో రూ.100కు చేరింది. పచ్చిమిర్చి కిలో రూ.120  ఉంది.  బీర, బెండ, దొండ, వంకాయ,  క్యారెట్​ కిలో ధర రూ.120కు చేరింది. పాలకూర, తోటకూర, పుంటికూర, గంగవాయిలి, తెల్లగర్జల కూర వేటిని  తాకినా.. కిలో రూ.100కు తక్కువలేవు. ఎక్కువ ధర ఉండడంతో  కొత్తిమీరను ప్రజలు కొనడం మానేశారు.  కిలో అల్లం, వెల్లుల్లి రేట్​   రూ.200లకు తగ్గడం లేదు.  మొన్నటి దాకా కిలో రూ.20 పలికిన ఉల్లిగడ్డలు ఇప్పుడు రూ.50కి చేరాయి.  

అడిగే వారులేరనే ధీమాతో సిండికేట్​ వ్యాపారులు ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని జరిగే మార్కెట్​ కు  స్థానికులు, శివారు గ్రామాల ప్రజలు వస్తుంటారు.  ఈ మార్కెట్​ రేట్లే  జిల్లా అంతటా ప్రభావం చూపుతాయి. జిల్లా కేంద్రంతోపాటు, శివారులో ఉన్న  వంద దాకా  హోటల్స్​,  కర్రీపాయింట్స్ నిర్వాహకులు గంజ్​, జుమేరాత్​ బజార్​ నుంచి కూరగాయలు కొంటారు.   నిన్నటి వరకూ నాలుగు కూరలు వడ్డించిన హోటళ్లనిర్వాహకులు  ఇప్పుడు రెండుకు తగ్గించేశారు. మరోవైపు  జిల్లాలో కూరగాయల సాగు నామమాత్రంగా ఉంది.

 అరెకరం కంటే తక్కువ  భూమి ఉన్న గిరిజనులు  కూరగాయలు పండిస్తున్నారు.  బోధన్​ మండలంలోని హున్సా, ఎడపల్లిలోని వడ్డేపల్లి, జైతాపూర్​, అంబం గ్రామాల్లో  కూరగాయలు సాగవుతున్నాయి.   జిల్లాలో మొత్తం  కూరగాయల సాగు వందెకరాలు కూడా లేదు.  దీంతో వ్యాపారులు  ఆంధ్ర నుంచి కూరగాయలను తెప్పించి,  స్థానిక మార్కెట్​లో  ఇష్టమొచ్చిన ధరకు అమ్ముతున్నారు.   నగరంలోని గౌతమ్​ నగర్​, పులాంగ్​ చౌరస్తాలతో పాటు,  నాందేవ్​ వాడలోని రైతు షెడ్​పై అధికారులు దృష్టి సారిస్తే.. కూరగాయల ధరలు అందుబాటులో ఉంటాయని ప్రజలు  కోరుతున్నారు.

ధరలు ఎక్కువ ఉన్నాయి  

అదుపులోని కూరగాయల రేట్లు ఎక్కువగా ఉన్నాయి.  రూ.200 వారానికి సరిపడా కూరగాయలు కొనేవాళ్లం. ఇప్పుడు రూ.700 సరిపోవడంలేదు. ఏం చేయాలో అర్థం అయితలే.

 - లలిత, గృహిణి