- మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో తగ్గిన దిగుబడి
- కార్తీక మాసంలో పెరిగిన కూరగాయల వినియోగం
- సామాన్యులకు కొనుగోళ్ల తిప్పలు
మహబూబాబాద్, వెలుగు: సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉండి రేట్లు తక్కువగా ఉండేవి. ఈ ఏడాది పరిస్థితి రివర్స్ అయ్యింది. వరుస వర్షాలు, మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో పంటల నష్టం జరిగి, కూరగాయల దిగుబడి తగ్గింది. వరదల కారణంగా రవాణా మార్గాలకు ఆటంకం కలుగడం, రవాణా ఖర్చులు పెరగడంతో మార్కెట్లకు కూరగాయల దిగుమతులు తగ్గుతున్నాయి. కొత్త పంట చేతికి అందడానికి సమయం పట్టడంతో మార్కెట్‌లో కొరత ఏర్పడింది.
కార్తీక మాసం, అయ్యప్ప మాలలను ధరించిన వారు ఉండడంతో కూరగాయల వినియోగం పెరిగింది. ఇదే సమయంలో నాన్వెజ్వాడకం తగ్గింది. కాగా, దిగుబడి తగ్గడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో పేదలు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ స్కూల్స్‌లో మధ్యాహ్న భోజనం తయారీకి కూడా నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు.
మహబూబాబాద్ మార్కెట్‌లో కూరగాయల ధరలు (కిలో చొప్పున..)
టమాట రూ.50, చిక్కుడు 100, సోరకాయ 40, ఉల్లిగడ్డ 40, ఆలుగడ్డ 45, పచ్చిమిర్చి 70, వంకాయ 70, బెండకాయ 70, క్యారెట్ 80, కాకరకాయ 80, బీరకాయ 80, క్యాప్సికం 75, గోబి 80, దోసకాయ, 60, బుడంకాయ 60, బీట్రూట్ 80, మునగ 80, కొత్తిమీర కేజీ 140, పుదీనా రూ.120, ఇతర ఆకు కూరల కట్ట ధరలు భారీగా పెరిగాయి.
కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు..
వరుస వర్షాల మూలంగా మానుకోట జిల్లాలో కూరగాయలు దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో రేట్లు గణనీయంగా పెరిగాయి. కూరగాయల సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు రూ.9,600 వరకు ప్రోత్సాహక నిధులు అందించడానికి నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాల వారీగా రైతుల వివరాలను అంచనా వేశాం. కొత్తగా కూరగాయలు సాగు చేసే రైతులకు సైతం ప్రోత్సాహకాలు అందిస్తాం. వచ్చే యాసంగిలో మహబూబాబాద్182 ఎకరాలు, జనగామ178, హనుమకొండ 60, వరంగల్150 సాగు చేయనున్నారు. ములుగు, జయశంకర్భూపాలపల్లిలో కూరగాయల సాగు పెద్దగా లేదు.- మరియన్న, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి, మహబూబాబాద్ధ
రలు సామాన్యులకు అందుబాటులో లేవు..
గతంలో ఎప్పుడూ లేనివిధంగా కూరగాయల ధరలు పెరిగిపోయాయి. రూ.500 లతో కూరగాయలు కొనుగోలు చేస్తే చిన్న కుటుంబానికి సైతం వారం రోజులు సరిపోవడం లేదు. సామాన్యులు కొనలేకపోతున్నారు. ధరల తగ్గింపు కోసం ప్రభుత్వం చర్యలను చేపట్టాలి. వర్తకులు తూకంలోను మోసాలు చేస్తున్నారు.- సీహెచ్.మాధవి, తొర్రూరు, గృహిణి
